పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యురాలు నరిందర్ కౌర్ భరాజ్ శుక్రవారం పార్టీలో కార్యకర్తగా పనిచేసే మణ్‌దీప్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. వీరి పెళ్లి పటియాలాలోని రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో జరిగింది. ఈ పెళ్లికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, భార్య గుర్ ప్రీత్ కౌర్‌తో సహా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. భవానీగఢ్ ప్రాంతంలోని లాఖేవాల్ గ్రామానికి చెందిన మణ్ దీప్‌ను ఆమె వివాహమాడారు. ఆయన గతంలో సంగ్రూర్ జిల్లా ఆప్ మీడియా ఇంఛార్జీగా పనిచేశారు. ఈ సమయంలో ఏర్పడిన పరిచయమే వివాహ బంధానికి దారితీసినట్లు తెలుస్తోంది.
28 ఏళ్ల నరీందర్ కౌర్ సంగ్రూర్‌లోని భరాజ్ గ్రామంలోని సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. పటియాలాలోని పంజాబ్ యూన్సివర్సిటీలో ఆమె ఎల్ఎల్‌బీ చదివారు. 2014 లోక్‌సభ ఎన్నికల వేళ తన గ్రామంలో ఒంటరిగా ఆమ్ఆద్మీ పార్టీ బూత్ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు నరిందర్ కౌర్. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రోత్సాహంతో రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
కాగా ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నరీందర్ కౌర్ సంగ్రూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాను 36,430 ఓట్లతో ఆమె ఓడించారు. అంతేగాక ఈ విజయంతో పంజాబ్ అసెంబ్లీలో అంత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నరీందర్ కౌర్ నిలిచారు.
నరీందర్ కౌర్ భరాజ్ భర్త.. మణ్‌దీప్ సింగ్‌ది కూడా ఓ రైతు కుటుంబమే. ఆయన భవానీగఢ్ ప్రాంతంలోని లాఖేవాల్ గ్రామానికి చెందిన వ్యక్తి. మణ్‌దీప్ గతంలో సంగ్రూర్ జిల్లా ఆప్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అయితే వీరిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు.