పంజాబ్‌లో భూగర్భ జలాల స్థాయి పడిపోతోంది. ఈ క్రమంలో భూగర్భ జలాలను కాపాడేందుకు ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భూమి నుంచి నీరు తోడే వారిపై పన్ను విధించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కొత్త పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు సర్కార్ రెడీ అవుతోంది.
ఈ నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయ అవసరాలు, గృహావసరాలకు భూగర్బ జలాలను ఉపయోగిస్తే ఎలాంటి పన్ను విధించబోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ చేపట్టిన నీటి పంపిణీ పథకాలు, సైనిక, కేంద్ర పారామిలటరీ బలగాలు, పట్టణ పురపాలికలను, పంచాయతీరాజ్ సంస్థలు, అభివృద్ధి మండళ్లు, కంటోన్మెంట్ బోర్డులు, ప్రార్థనా స్థలాలకు కూడా మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పింది.
నెలలో 300 క్యూబిక్ మీటర్ల నీటిని తోడేందుకు వారికి అనుమతులు ఇచ్చింది. మిగిలిన వర్గాల వారు భూగర్భ జలాన్ని వాడుకునేందుకు గాను అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి వుంటుందని పేర్కొంది. పంజాబ్‌లో భూగర్భ జలవనరులు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ప్రతి యేటా భూమిలోకి వచ్చి చేరుతున్న నీరు, వినియోగిస్తున్న తీరు ఆధారంగా వాటిని మూడు రకాలుగా వర్గీకరించనున్నారు. దాని ప్రకారం.. గ్రీన్ జోన్‌లో క్యూబిక్ మీటర్ నీటి పై రూ.4-14, ఎల్లో జోన్‌లో రూ.6-18, ఆరెంజ్ జోన్ లో రూ.8-22 చొప్పున ప్రభుత్వం వసూలు చేయనుంది.