ఐపీఎల్2022 సీజన్ 15 రోజు రోజుకు ఆసక్తిగా మారితుంది. గుజరాత్, లక్నో టీమ్ లు ఇప్పటికే మొదటి రెండు స్థానాల్లో బెర్త్ సుస్థిరం చేసుకోగా.. ప్లే ఆఫ్స్ లో మూడు, నాలుగు స్థానాలు ఆసక్తిగా మారాయి. ఇప్పటికే కీలక టీమ్ లు చెన్నై, ముంబై పెవిలియన్ చేరాయి. శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటర్లు… బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ వీర విహారంతో 209 పరుగులు చేసింది. ఆ తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. పంజాబ్ బౌలర్లకు దాసోహమైన బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసి విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది.
ఆర్సీబీ బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక్కడే కాసేపు క్రీజ్ లో పోరాటం చేశాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (20), కెప్టెన్ డుప్లెసిస్ (10) మరోమారు తీవ్రంగా నిరాశపరిచారు. రజత్ పటీదార్ 26 పరుగులు చేయగా, మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీసుకోగా, రిషి ధావన్, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచిన డుప్లెసిస్ పంజాబ్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి బంతి నుంచే బెయిర్‌స్టో బౌలర్లపై విరుచుకుపడుతుంటే కానీ తన నిర్ణయం ఎంత తప్పో డుప్లెసిస్ తెలుసుకోలేకపోయాడు. బెయిర్‌స్టో, ధావన్ జోడీ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాజపక్స (1) కూడా క్రీజులో నిలవలేకపోయాడు. అయితే, లివింగ్ స్టోన్ వచ్చాక మ్యాచ్ స్వరూపం మారిపోయింది. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 83 పరుగులు పిండుకుంది. ఈ సీజన్ మొత్తంలోనే ఈ స్కోర్ రికార్డు.
ఓవైపు బెయిర్‌స్టో, మరోవైపు లివింగ్‌స్టోన్ చెలరేగిపోతుండడంతో బెంగళూరు బౌలర్లే ప్రేక్షకులు అయ్యారు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని మోత మోగించారు. ఈ క్రమంలో 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసిన బెయిర్‌స్టో అవుటయ్యాక స్కోరు వేగం కొంత మందగించింది. వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. అయితే… లివింగ్‌స్టోన్ చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండడంతో పరుగుల వరద పారింది. చివరికి 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేసి 206 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది పంజాబ్.
ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను పంజాబ్ సజీవంగా నిలుపుకుంది. 12 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. పంజాబ్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన బెయిర్‌స్టోకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.