రూ.వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణపై స్పందించారు.
నందమూరి తారక రామారావు ఒక సంచలనమని కొనియాడారు పురందేశ్వరి. నేటి నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలను గుర్తించామని వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ఈ ఉత్సవాలు ఏడాది పాటు ఘనంగా జరగనున్నాయని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణ పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.
బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఆ కమిటీలో ఉన్నారని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని ఘనంగా సత్కరించనున్నామని వెల్లడించారు పురందేశ్వరి.