దేశంలోని హిందూ దేవాలయాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం అత్యంత పురాతన దేవాలయంగా విరాజిల్లుతుంది. ముఖ్యంగా ఈ ఆలయంలోని వంటశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి జగన్నాథుడి అవతారంలో మధ్యాహ్నానికి పూరీ క్షేత్రం చేరుకొని “మహాప్రసాదం” ఆరగించేదని చెప్పబడింది. అందుకే ఇక్కడ వడ్డించే భోజనాన్ని మహాప్రసాదం అని పిలుస్తారు. అయితే, ఎంతో ప్రాచీనమైన ఈ పుణ్యక్షేత్రంలో అనూహ్య ఘటన జరిగింది. ఆనంద్ బజార్లో ఉన్న మందిర వంటశాలలో.. మట్టితో చేసిన 40 పొయ్యిలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
వంటశాలను శనివారం మూసివేసిన సేవకులు.. ఆదివారం తిరిగి తెరిచి చూసేసరికే మట్టి పొయ్యిలు ధ్వంసం అయి ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్, పూరీ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసు పై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆలయ వంటశాల ఆవరణలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. ఈ నేపథ్యంలో ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత పవిత్రమైన పూరీ జగన్నాథుడి ఆలయ వంట గదిలో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారెవరైనా ఉపేక్షించేది లేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విచారణ కోసం ఇద్దరు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఆలయ సేవకులు, భద్రతా సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసి.. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పూరీ జిల్లా మేజిస్ట్రేట్ సమర్థ్ బర్మ తెలిపారు. రెండు రోజుల్లోగా దర్యాప్తు నివేదిక అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన పొయ్యిల ద్వారా 15 వేల మందికి పైగా భక్తులకు భోజనం తయారు చేయవచ్చు. ఈ గుడిలో రోజూ లక్ష మందికి స్వామివారి భోజన ప్రసాదాన్ని అందిస్తారు.
కాగా, ఇక్కడి వంటగదిని “రోసాఘరా”గా పిలుస్తారు. సాక్షాత్తు మహాలక్ష్మీ ఈ వంటలను పర్యవేక్షిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. జగన్నాథుడి రాకకోసం ఇక్కడ నిత్యం 56 రకాల వంటకాలు సిద్ధం చేసి దేవదేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన పూరీ ఆలయ వంటగదిలో మొత్తం 240 మట్టి పొయ్యిలు ఉన్నాయి. ఇక్కడ ఒకసారి వినియోగించిన పాత్రలను(మట్టి కుండలు) తిరిగి ఉపయోగించరు. ఎంతమంది ప్రజలు ఆకలితో వచ్చినా..ఇక్కడ ఎప్పుడు ఒకరికి భోజనం మిగిలే ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.