భారీ అంచనాల మధ్య తెరకెక్కింది లైగర్ సినిమా. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ ఫ్రెష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చింది. అక్కడ కూడా దీనికి ఏమంత రెస్పాన్స్ రాలేదు. అలా లైగర్ ఛాప్టర్ ముగిసింది. ఎట్టకేలకు ఈ సినిమా ఫెయిల్యూర్ పై పూరి జగన్నాధ్ స్పందించాడు. ఫెయిల్యూర్ పై ఎక్కువ రోజులు బాధపడకూడదంటున్నాడు.
“సక్సెస్ వస్తే చాలా ఎనర్జీ వస్తుంది. ఫెయిల్యూర్ వస్తే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. సక్సెస్ వచ్చినప్పుడు జీనియస్ లా కనిపిస్తాం. మూవీ ఫెయిల్ అయితే ఫూల్ లా కనిపిస్తాం. ఒక్కోసారి సినిమాకు పనిచేసినోళ్లు, నమ్మినోళ్లు కూడా రివర్స్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోతుంటారు. ఆ టైమ్ లో కోలుకోవడానికి మానసికంగా చాలా బలంగా ఉండాలి. అదే టైమ్ లో కోలుకునే సమయాన్ని తగ్గించుకోవాలి.
తక్కువ టైమ్ లో కోలుకోవాలి. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మనుషులు పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, యుద్ధాలు జరగొచ్చు. ఇలా ఎన్ని జరిగినా కోలుకునే సమయం నెల రోజులకు మించి ఉండకూడదు. లైగర్ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. ప్రొడక్షన్, నటీనటులు, టెక్నీషియన్స్ తో మూడేళ్లు ఎంజాయ్ చేశాను. మంచి సెట్స్ వేశాం, మైక్ టైసన్ తో షూట్ చేశాం. ఇలా మూడేళ్లు కష్టపడుతూ ఎంజాయ్ చేశాం. కానీ ఫెయిల్యూర్ వచ్చింది. అలా అని మరో మూడేళ్లు ఏడుస్తూ కూర్చోలేం కదా.”
ఇలా లైగర్ ఫెయిల్యూర్ పై స్పందించాడు పూరి జగన్నాధ్. తన జీవితంలో బాధపడిన రోజుల కంటే, ఆనందంగా గడిపిన రోజులే ఎక్కువగా ఉన్నాయని.. అలా ఉన్నప్పుడే జీవితానికి ఓ అర్థం అన్నాడు పూరి జగన్నాధ్.