మరో భారీ షెడ్యూల్ కు ప్రిపేర్ అవుతోంది పుష్ప యూనిట్. ఈసారి కూడా మారేడుమిల్లి వెళ్లబోతున్నారు. అయితే ఈసారి మరింత కీలకమైన షెడ్యూల్. అవును… పుష్ప-2 సెట్స్ పైకి అల్లు అర్జున్ రాబోతున్నాడు. రష్మిక కూడా వస్తోంది.
రీసెంట్ గా ఫహాద్ ఫాజిల్ తో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు దర్శకుడు సుకుమార్. దానికి సంబంధించి ఓ వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. పుష్ప-2లో పోలీసాఫీసర్ షెకావత్ గా కనిపించబోతున్నాడు ఫాజిల్. ఆ షెడ్యూల్ ను మారేడుమిల్లిలో పూర్తిచేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కూడా మారేడుమిల్లిలోనే మొదలవుతుంది.
పుష్పరాజ్ పాత్రలో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. పార్ట్-2కు సంబంధించి ఇప్పటికే బన్నీపై కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేశారు. ఆ తర్వాత షూట్ నుంచి గ్యాప్ తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు, ఓ యాడ్ తో పాటు మరికొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు కూడా పూర్తిచేశాడు.
అలా అన్ని కమిట్ మెంట్స్ పూర్తిచేసుకొని, ఇప్పుడు కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు బన్నీ. ప్రస్తుతానికి మారేడుమిల్లిలో షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా ఫిక్స్ కాలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.