పుష్ప పార్ట్-1 రిలీజ్ అవ్వడమే ఆలస్యం.. పార్ట్-2 షూటింగ్ మొదలైపోతుందని ఊదరగొట్టారు. అంతేకాదు, ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తుందని కూడా అప్పట్లో ప్రకటనలు చేశారు. అయితే ఎప్పుడైతే పార్ట్-1 సక్సెస్ అవ్వడంతో పాటు, కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తాయో అప్పుడిక హీరో-దర్శకుడు డిఫెన్స్ లో పడిపోయారు.
పుష్ప పార్ట్-1లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగాలేదనే విమర్శలు వచ్చాయి. వీటికి తోడు గ్రాఫిక్స్ పై కూడా కామెంట్స్ వినిపించాయి. వీటిని పార్ట్-2లో సరిదిద్దుకోవాలనుకుంటున్నారు మేకర్స్. పాటల బాధ్యతను దేవిశ్రీకి అప్పగిస్తూనే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరో సంగీత దర్శకుడ్ని తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక గ్రాఫిక్స్ విషయంలో కూడా 3 నెలలు అడ్వాన్స్ గా ఉంటూ గ్రాఫిక్స్ పూర్తిచేయాలనుకుంటున్నారు. దీంతో సినిమా మరింత ఆలస్యమయ్యేలా ఉంది.
ఇక పుష్ప పార్ట్-2 షూట్ లేట్ అవ్వడానికి మరో రీజన్ ఈ సినిమా హిందీలో హిట్టవ్వడమే. నార్త్ లో పుష్ప పెద్ద హిట్టయింది. దీంతో పార్ట్-2 కోసం మార్పుచేర్పులు మొదలయ్యాయి. కేజీఎఫ్ తరహాలోనే పుష్ప-2లో కూడా బాలీవుడ్ జనాలకు చోటివ్వాలని నిర్ణయించారు. అలా చేయాలంటే స్క్రిప్ట్ మార్చాల్సిందే. ప్రస్తుతం సుకుమార్ ఆ పనిలోనే ఉన్నాడు.
మరోవైపు పుష్ప-2ను మరింత గ్రాండియర్ గా తెరకెక్కించాలని బన్నీ కండిషన్ పెట్టాడు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలకు తీసిపోని విధంగా పుష్ప-2 ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలని ఆదేశించాడు. దీంతో ఆ దిశగా కూడా కసరత్తులు సాగుతున్నాయి. ఇలా అన్నీ కలిసి పుష్ప-2 షూట్ ను లేట్ చేస్తున్నాయి.