ఉక్రెయిన్‌పై దాడిలో అణ్వాయుధాలను రష్యా ప్రయోగించే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు. రసాయన ఆయుధాలను కూడా రష్యా ఉపయోగించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఉక్రెయిన్ పై రష్యా అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని యూఎస్ సీఐఏ డైరెక్టర్ ఇటీవల హెచ్చరించారు. రష్యా సైన్యానికి ఎదురుదెబ్బలు తాకడంతో తక్కువ ప్రమాధాన్ని కలిగించే అణ్వాయుధాలను పుతిన్ ఉపయోగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలో జెలెన్ స్కీ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రష్యా అణుదాడులు చేసే అవకాశం ఉందన్న వార్తలతో ఆందోళ చెందుతున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ… తాను ఒక్కడినే కాదనీ, ప్రపంచం మొత్తం ఈ విషయంలో ఆందోళన చెందాలన్నారు. తమ దేశంపై రష్యా రసాయ ఆయుధాలను ఉపయోగించే అవకాశం లేకపోలేదన్నారు.
ప్రజల ప్రాణాలంటే రష్యా అధ్యక్షుడికి పెద్దగా లెక్కలేదన్నారు. రష్యా దాడులకు మనం భయపడకూడదు. కానీ దాడులను ఎదుర్కొనేందుకు మాత్రం సిద్ధంగా ఉండాలన్నారు. అయితే ఇది ఒక్క ఉక్రెయిన్ సమస్య కాదనీ ప్రపంచ మొత్తం దీనిపై ఆలోచనలు చేయాలన్నారు.