ఉక్రెయిన్ బలహీనమైన దేశమని పుతిన్ అంచనా వేసి ఉంటే అది పూర్తిగా తప్పని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము అన్నివిధాలా అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్ బలహీనదేశమని, పశ్చిమ దేశాలను చీల్చవచ్చునని రష్యా అధ్యక్షుడు భావించి ఉన్న పక్షంలో ..అది ‘డెడ్ రాంగ్’ అన్నారు. అంటే పుతిన్ ఆలోచన పూర్తిగా అర్థరహితం అని వ్యాఖ్యానించారు.
ముందు షెడ్యూల్ అన్నది ఏదీ లేకుండా బైడెన్ హఠాత్తుగా అమెరికా నుంచి సోమవారం ఉక్రెయిన్ చేరుకొని రాజధాని కీవ్ నగరంలో అధ్యక్షుడు జెలెన్స్కీ తో భేటీ అయ్యారు. సుమారు సంవత్సరం క్రితం రష్యా ఈ దేశం మీద దాడికి దిగిందని, ఇది బలహీన దేశం గనుక తాము సులభంగా విజయం సాధించవచ్చునని, పశ్చిమ దేశాలను రెండుగా చీల్చవచ్చునని పుతిన్ భావించినట్టు కనబడుతోందని ఆయన అన్నారు. మాపై పైచేయి సాధించవచ్చునని పుతిన్ అనుకుంటే అది తప్పని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా గత ఏడాది ఫిబ్రవరి 24 న దాడికి దిగింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. రష్యా దురాక్రమణను అనేక దేశాలు ఖండించాయి. ఈ తరుణంలో యుద్ధం తగదని, ఉభయదేశాలూ దౌత్యపరంగా చర్చలకు కూర్చుని శాంతి నెలకొనేలా చూడాలని ప్రధాని మోడీ సైతం పుతిన్ కి సూచించారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు తాము సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని జోబైడెన్ .. మళ్ళీ జెలెన్స్కీ కి స్పష్టం చేశారు.
పుతిన్ యుద్ధ కాన్సెప్ట్ విఫలమైందన్నారు. ఇదే సమయంలో రష్యా ఎకానమీ ఒడిదుడుకులకు గురవుతోందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ కి తమ దేశం నుంచి మరింత సాయంపై చర్చలు ఇంకా కొనసాగుతాయని, ఇందులో భాగంగానే తాను ఇక్కడికి చేరుకొని జెలెన్స్కీ తో సమావేశమయ్యానని బైడెన్ వివరించారు.’ మా దేశం నుంచి మరిన్ని ఆయుధాలు, ఎయిర్ సర్వేలెన్స్ రాడార్లు వంటివాటిని ఈ దేశానికి అందజేస్తాం.. రష్యా యుద్ధ కాంక్షను సమర్థిస్తున్న కంపెనీలు, ఇతర దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించేలా చూస్తాం’ అని ఆయన ప్రకటించారు. వార్ జోన్ ను బైడెన్ సందర్శించడం ఇదే మొదటిసారి.