నాటో కూటమిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేస్తామని ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలీ నీనిస్టో ఇటీవల వెల్లడించారు. దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. నాటో సైనిక కూటమిలో చేరేందుకు ఫిన్లాండ్, స్వీడన్ తీసుకున్న నిర్ణయాలు తీవ్రమైన తప్పిదాలుగా రష్యా అభివర్ణించింది.
ఈ క్రమంలో ఫిన్లాండ్ పై దాడికి రష్యా సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఫిన్లాండ్ సరిహద్దుల వైపు అణు సామర్థ్యం కలిగిన క్షిపణులను రష్యా మోహరిస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియోను మంగళవారం పోస్టు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఫిన్లాండ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న పశ్చిమ రష్యన్ పట్టణం వైబోర్గ్‌కు వెళ్లే మార్గంలో మోటర్‌వే నుండి మొబైల్ ఇస్కాండర్ క్షిపణులను మోహరించినట్లు కనిపిస్తోంది.
దీని ప్రకారం.. ఏడు బాలిస్టిక్ క్షిపణులను ఫిన్లాండ్ సరిహద్దు వైపుగా రష్యా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. వీడియో పోస్టు అయ్యే సమయానికి అవి ఫిన్లాండ్ సరిహద్దుకు 24 మైళ్ల దూరంలో ఉన్నట్టు అర్థమవుతోంది. నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామని ఫిన్లాండ్ ప్రకటించిన కొద్ది సేపటికే వీడియో విడుదల కావడం గమనార్హం.