ఉక్రెయిన్ పై యుద్ధంలో అణ్వాయుధాలు ఉపయోగిస్తానంటూ గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన బెదిరింపులు జోక్ కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత ఎదురైన అత్యంత సంక్లిష్ట పరిస్థితిగా దీన్ని బైడెన్ వివరించారు.
ఉక్రెయిన్ యుద్దం విషయంలో అణ్వాయుధాలు గానీ, జీవాయుధాలు గానీ, రసాయన ఆయుధాల వినియోగం విషయంలో పుతిన్ జోక్ చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. మన్ హట్టన్ లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అర్మె గెడాన్ లాంటి పరిస్థితులను అమెరికా తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 1962లో క్యూబా క్షిపణుల సంక్షోభాన్ని అమెరికా ఎదుర్కొన్నదని ఆయన అన్నారు. అమెరికా టార్గెట్ గా అప్పుడు రష్యా తన మిస్సైల్‌ను క్యూబాలో ఉంచిందన్నారు. ఆ సమయంలో చాలా సంక్లిష్టమైన పరిస్థితి ఎదురైందన్నారు.
తాజాగా ఇప్పుడు మరోసారి నేరుగా అణ్వాయుధాల బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితి
ఒకవేళ ఇలానే ఉంటే, సమస్య మరింత జఠిలంగా మారుతుందని బైడెన్ వెల్లడించారు. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నడీ, సోవియేట్ నేత నికితా కురుచ్చేవ్‌లు ఓ దశలో అణ్వాయుధ దాడికి రెచ్చగొట్టుకున్నారన్నారు. 1962 నాటి పరిస్థితి మళ్లీ ఇప్పుడు వస్తున్నట్లు బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.