ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడానికి ఉద్దేశించిన డిక్రీపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. అంటే ఇందుకు సంబంధించిన చట్టాలు ఖరారయ్యాయి. కానీ ఇది అంతర్జాతీయ చట్టాలను ఇది ఉల్లంఘించడమేనని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ విలీన డాక్యుమెంట్లను బుధవారం రష్యన్ ప్రభుత్వ వెబ్ సైట్ లో ప్రచురించారు.
ఉక్రెయిన్ లోని డోనెస్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోర్జిజియా ప్రాంతాలను తమ దేశంలో కలిపేసుకుంటున్నామని ఇదివరకే ఈ దేశ ఉభయ సభలు పేర్కొన్నాయి. ఈ వారారంభంలో పార్లమెంట్ దీనికి సంబంధించిన ‘ఒప్పందాలను’ ఆమోదించింది. ఈ నాలుగు ప్రాంతాల్లో ‘రెఫరెండంలను’ నిర్వహించామని ప్రభుత్వం చెప్పుకుంది. కానీ పశ్చిమ దేశాలు దీన్ని సిగ్గుచేటైన విషయంగా తోసిపుచ్చాయి.
ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం ఓ కొత్త ప్రమాదకరమైన దశకు చేరుకున్న సందర్భంలో పుతిన్ ఈ డిక్రీపై సంతకం చేయడం విశేషం. ఉక్రేనియన్ దళాలు ముందుకు చొచ్ఛుకు వస్తుండగా .రష్యా సేనలు తోక ముడుస్తున్నాయి. . దీంతో పుతిన్ కి పుండు మీద కారం రాచినట్టవుతోంది. అందుకే భారీ సంఖ్యలో సైన్యంలో చేరాలని ప్రజలను ఒత్తిడి చేస్తున్నాడు. మాజీ సైనికోద్యోగులు, ఇంకా యుక్తవయస్సు రానివారు కూడా మిలిటరీలో చేరాలని, దేశసేవ చేయాలని ఆదేశిస్తున్నాడు.
ర్యాపర్ ఆత్మహత్య
ఇలా సైన్యంలో చేరడానికి యువకుల ఎంపిక కోసం అధికారులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. అందులో ..స్టేజీపై పాటలతో పర్ఫామ్ చేసే ఓ ర్యాపర్ పేరు కూడా ఉంది. 27 ఏళ్ళ ఇతడిని ఇవాన్ విటలీవిచ్ అనే యువకుడిగా గుర్తించారు. కానీ యుద్ధం చేసే ఇష్టం లేని ఈ ర్యాపర్ ఓ భవనం లోని పదో అంతస్థు నుంచి కిందికి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ‘ఈ వీడియోను మీరు చూస్తున్నప్పుడు నేను బతికి ఉండను’ అని అంతకు ముందు ఓ వీడియో మెసేజ్ పెట్టాడు. పుతిన్ ని ఇవాన్.. ‘నిరంకుశుడిగా’ దుయ్యబట్టాడు.