ఉక్రెయిన్ లో తాము ఆక్రమించుకున్న నగరాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వేచ్ఛగా పర్యటిస్తున్నారు. ఇటీవలే క్రిమియా నగరాన్ని సందర్శించిన ఆయన.. ఆదివారం మరియు పోల్ సిటీలో పర్యటించారు. గత సెప్టెంబర్ లో ఈ సిటీని రష్యన్ బలగాలు ఆక్రమించుకున్నాయి. ఈ నగరం రష్యా అధీనం కాకుండా చూసేందుకు ఉక్రెయిన్ సైనికులు సుమారు మూడు నెలల పాటు పోరాడారు. చివరకు ఇది పూర్తిగా రష్యా హస్తగతమయింది.
మరియు పోల్ లో పుతిన్ వివిధ ప్రాంతాలను విజిట్ చేసి స్థానికులతో ముచ్చటించారు. రెండు యుద్ధ నేరాలకు సంబంధించి కోర్టు ఆయనకు అరెస్ట్ వారంట్ జారీ చేసినప్పటికీ ఆయన పట్టించుకోకుండా ఈ పర్యటనల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ వారెంట్లపై ఎలాంటి వ్యాఖ్యా చేయని పుతిన్ పై ప్రస్తుతం ఎలాంటి విచారణ జరగకపోవచ్చునని భావిస్తున్నారు.
ఇక చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ వారంలో మాస్కోను విజిట్ చేయనున్నారు. . పశ్చిమ దేశాలతో తాను అనుసరిస్తున్నఘర్షణాత్మక వైఖరి విషయంలో పుతిన్ కి.. జిన్ పింగ్ పర్యటన ఫలితంగా దౌత్యపరమైన గట్టి మద్దతు లభించే సూచనలున్నట్టు తెలుస్తోంది.
పుతిన్ హెలికాఫ్టర్ లో ఆదివారం మరియు పోల్ చేరుకుని స్వయంగా కారు నడుపుతూ ఈ నగరంలోని మెమోరియల్ సైట్స్ ని సందర్శించారని రష్యన్ మీడియా తెలిపింది. ఉక్రెయిన్ తో వార్ కారణంగా దాదాపు శిథిలావస్థకు చేరుకున్న ఈ సిటీ పునర్నిర్మాణం ఈ ఏడాది అంతానికి పూర్తవుతుందని రష్యా డిప్యూటీ ప్రధాని మారట్ ఖుస్నులిన్ తెలిపారు. చాలామంది ప్రజలు తిరిగి ఈ నగరానికి చేరుకుంటున్నారని ఆయన చెప్పారు. మరియు పోల్ లో మళ్ళీ విద్యుత్, నీరు వంటి సౌకర్యాలను పునరుద్ధరించవలసి ఉందన్నారు.