రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని ఆయన ఆంతరంగికులే ఏదో ఒక రోజున హతమారుస్తారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ జోస్యం చెప్పారు. పుతిన్ నాయకత్వం పట్ల ‘తిరుగుబాటు’ వంటి కాలం వస్తుందని, ఆయన అత్యంత సన్నిహితులే ఆయనపై తిరగబడతారని జెలెన్స్కీ అన్నారు. ‘ఇయర్’పేరిట రూపొందించిన ఉక్రేనియన్ డాక్యుమెంటరీలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ‘న్యూస్ వీక్’ పత్రిక తెలిపింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా ఈ నెల 24 న ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. పుతిన్ సన్నిహితులు ఏదో ఒక కారణంపై ఆయనను మట్టుబెట్టడం ఖాయమని, ఆ సందర్భంగా వారు ఇప్పటి తన మాటలను గుర్తుకు తెచ్చుకుంటారని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఇది ఎప్పుడు జరుగుతుందో మాత్రం చెప్పలేనన్నారు.
పుతిన్ సన్నిహిత వర్గంలో నిరాశా నిస్పృహలు ఆవరించాయని, వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని రష్యా నుంచి వచ్చిన వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనబడుతోందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. వార్ జరుగుతుండగా అనేకమంది రష్యన్ సైనికులు బిగ్గరగా కేకలు పెడుతూ, రోదిస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయని, రష్యన్ సైన్యంలో నానాటికీ ఆందోళన పెరిగిపోతోందనడాన్ని ఇవి రుజువు చేస్తున్నాయని ఈ పత్రిక తెలిపింది.
యుద్ధం ముగింపు దశకు వచ్చిందనడానికి క్రిమియాను రష్యా నుంచి తాము తిరిగి స్వాధీనం చేసుకోవడమే నిదర్శనమని జెలెన్స్కీ నిన్న వ్యాఖ్యానించారు. ఇది తమ భూభాగమని, ఇక్కడి ప్రజలు తమ వారని, ఇది తమ చరిత్ర అని ఆయన అన్నారు. దేశంలో ప్రతి చోట తమ జాతీయ పతాకాలను ఎగురవేస్తామన్నారు. అయితే జెలెన్స్కీ మాటలపై క్రెమ్లిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.