హైకోర్టు న్యాయవాదుల దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పాత్ర లేదంటూ పోలీసులు కవర్ చేస్తున్నా.. ఆధారాలు మాత్రం ఆయన్నే అసలు సూత్రధారిగా నిలబెడుతున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాసే అయినప్పటికీ.. అందుకు కావాల్సిన కారు సమకూర్చడంతో పాటు హత్య చేసేందుకు అవసరమైన రెండు కత్తులనూ పుట్ట మధు మేనల్లుడైన బిట్టు శ్రీనివాస్ అందించాడని స్వయంగా పోలీసులే చెప్పారు. అయితే అదే పోలీసులు హత్యలకు కారణం మాత్రం వామన్ రావు, శ్రీనివాస్ మధ్య గుడి విషయంలో తలెత్తిన వివాదమేనంటూ నిర్ధారించడం వారి దర్యాప్తుపై అనుమానాలు కలిగేలా చేస్తోంది.
పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్‌గా ఈ బిట్టు శ్రీనివాస్ ఉన్నాడు. సాధారణంగా ఏ విషయమైనా పుట్టమధుతో సంప్రదించాకే బిట్టు శ్రీనివాస్ చేస్తుంటాడని తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద హత్యల విషయంలో ఓ మాట కూడా చెప్పకుండా, ఆయన డైరెక్షన్ లేకుండానే కారు, కత్తులు అందించాడంటే నమ్మశక్యంగా లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. పైగా హత్యకు వాడిన కత్తులని కూడా అధికార పార్టీకే చెందిన ఓ నేతకు సంబంధించిన ఫ్రూట్ షాప్ నుంచి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన తమ కంట్లో నలుసుగా మారిన లాయర్ వామన్‌రావు దంపతులను హత్య చేసేందుకు మంథని అధికార పార్టీ నేతలు తలా ఒక చేయి వేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బిట్టు శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఆతన్ని పట్టుకుంటే ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తుందని అంటున్నారు. అయితే హత్య చేసినవాళ్లు, ఆయుధాలు సమకూర్చినవాళ్లు, అందుకు సాయం చేసినవాళ్లు అందరికి కామన్ పాయింట్ పుట్ట మధునే అయినప్పటికీ.. పోలీసులు మాత్రం ఈకేసులో ఏ రకంగానూ ఆయన పేరు ఎత్తకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.