– ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పందించిన పువ్వాడ
– బండి కళ్లకు పరీక్షలు చేయించుకోవాలని సెటైర్స్
– కాంగ్రెస్ కు కాంగ్రెసే శత్రువంటూ చురకలు
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భా సభ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సభ ఫ్లాప్ అయిందని బండి విమర్శిస్తే.. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలవకుండా కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు రేవంత్. అంతేకాదు.. మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష నేతలు. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు.
ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో తన కళ్ళకు పరీక్ష చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఒకవేళ చూపించేందుకు వెళ్ళలేకపోతే బండి దగ్గరకే తాము ఓ టీం ను పంపిస్తామని చురకలంటించారు. అలాగే 24 గంటల కరెంట్ గురించి సందేహాలు ఉంటే ఎక్కడైనా కరెంట్ తీగను పట్టుకోవాలని సూచించారు. సభతో దేశ రాజకీయాలే కాదు ఖమ్మం రాజకీయాలు కూడా మారుతాయన్నారు. ఖమ్మంలో ప్రజలు 18వ తేదీన సంక్రాంతి జరుపుకున్నారని తెలిపారు.
ఇక కాంగ్రెస్ పార్టీని ఓడించే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు అజయ్. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెసే శత్రువంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ని ఓడించే కార్యాచరణ తీసుకోవడం తమకేం అవసరం లేదన్నారు. వైస్ రాజశేఖర్ రెడ్డి ఈ విషయం చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను ఓడించడానికి సుపారీలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. వాళ్ళ నేతలే చాలంటూ సెటైర్లు వేశారు పువ్వాడ.
మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ సంపదను ఇద్దరు గుజరాతీలు మరో గుజరాతీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ ఆటలు చెల్లవు గాక చెల్లవు అని ఖమ్మం సభ సందేశం ఇచ్చిందని తెలిపారు. విద్యుత్ రంగాన్ని కూడా ఆదానీకి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని.. దీన్ని ఉద్యోగులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు రాజేశ్వర్ రెడ్డి.