వైటీపీ అధ్యక్షుడు షర్మిల చేసిన చేసిన కామెంట్స్ కు మంత్రి పువ్వాడ అజయ్ బాగానే హర్టయినట్టున్నారు. పాత విషయాలన్నీ గుర్తు చేస్తూ.. వైఎస్ ఫ్యామిలీ మొత్తంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని షర్మిలకు సూచించారు.
గురువారం ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా పువ్వాడ అజయ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు షర్మిల. ఆయన అరాచకాలు పెరిగిపోతున్నాయని ఫైరయ్యారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అజయ్.. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలని సవాల్ చేశారు. తానేంటో చూపిస్తానంటూ మండిపడ్డారు.
షర్మిల పాలేరులో పోటీ చేసినా తన దమ్మేంటో చూపిస్తానన్నారు పువ్వాడ. మీ నాన్న, అన్నలు డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇచ్చారని షర్మిలపై మండిపడ్డారు. అయితే.. మంత్రి వ్యాఖ్యలపై వైటీపీ శ్రేణులు భగ్గుమన్నారు.
మధిర నియోజక వర్గం ముదిగొండ మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. షర్మిలపై పువ్వాడ అనుచిత వాఖ్యలు చేసినందుకు నిరసన తెలిపారు. కోదాడ వెళ్ళే రహదారిపై బైఠాయించారు. పువ్వాడ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి… దిష్టిబొమ్మ దహనం చేశారు.