మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవన్నారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంత మంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు. కొంత మంది నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమ్మేళనం పేరుతో కేసీఆర్ ని తిట్టే చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు.
గత డిసెంబర్ వరకు కేసీఆర్ ను ఎంతగా ఉపయోగించుకున్నారో వాళ్లకు తెలియదా.. అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ వ్యక్తిగత పదవులు ఇవ్వలేదని కేసీఆర్ ని విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మంచి పనులు చేయడం కేసీఆర్ తప్పా.. అందుకేనా కేసీఆర్ ని గద్దె దించాలని చూస్తారా.. అంటూ మండిపడ్డారు.
కళ్లు ఉన్న కాబోదులు గోదావరి జలాలతో కాళ్లు ఎప్పుడు కడుగుతారు.. అంటున్నారని పువ్వాడ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అశ్వారావు పేట నియోజక వర్గం నుంచి వేలేరుపాడు, కుకునూరు మండలాలను బీజేపీ పార్టీ లాక్కుంటే.. అదే పార్టీ వైపు కొంత మంది చూస్తున్నారని అన్నారు.
అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభివృద్ధిలోని శిలా ఫలకం ఒక్కటైన చూపించు.. అని ఆయన పొంగులేటికి సవాల్ విరిరారు. మీ ఒక్కరికి కడుపు నొప్పి వస్తే అందరికి వచ్చిందనుకుంటే అది పొరపాటు అంటూ పువ్వాడ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ని గద్ద దించడం నీ వల్ల కాదు కదా.. ఎవరి వల్ల కాదంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కరే కాపాడుతారని పువ్వాడ అన్నారు.