సింగపూర్ ఓపెన్ లో అంచనాలకు తగ్గట్టే పీవీ సింధు సత్తా చాటింది. ఫైనల్ లో చైనా షట్లర్ వాగ్ యూని ఓడించింది. దీంతో ఈ సీజన్ లో తొలి సూపర్ 500 టైటిల్ ను దక్కించుకుంది.
మ్యాచ్ లో మొదట్నుంచి సింధు తన హవాను ప్రదర్శించింది. ఆమె దూకుడు ముందు వాంగ్ యూ తేలిపోయింది. తొలి సెట్ ను అలవోకగా నెగ్గిన సింధు.. రెండో సెట్ ను మాత్రం 11-21 తేడాతో కోల్పోయింది. కానీ.. మూడో సెట్ లో పుంజుకుని 21-15తో గెలిచింది. దీంతో ట్రోఫీ ఆమె సొంతమైంది.
శనివారం జరిగిన సెమీస్ లోనూ అద్భుతమైన ఫామ్ తో కనిపించింది సింధు. ఆ మ్యాచ్ లో జపాన్ షట్లర్ సయెనా కవాకమీని చిత్తు చేసింది. ఫైనల్ లో చైనా క్రీడాకారణికి చుక్కలు చూపించింది. జులై 28 నుంచి బర్మింగ్ హామ్ లో జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్ కు ముందు ఈ విజయం సింధుకు మరింత బూస్టప్ లాంటిదని అంటున్నారు.
ఈ ఏడాది రెండు సూపర్ 300 టైటిళ్లు గెల్చుకుంది సింధు. ఇందులో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు 500 టోర్నీలో ఫైనల్ కూడా సాధించింది.