సూపర్ ఫామ్ లో ఉన్న భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సింగపూర్ ఓపెన్ లో సత్తా చాటుతోంది. సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీస్ లో జపాన్ షట్లర్ సయెనా కవాకమీని చిత్తు చేసింది. 21-15, 21-7 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. ఈమ్యాచ్ 32 నిమిషాల్లోనే ముగిసింది.
సింధు సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. మెడల్ కు మరో అడుగు దూరంలో ఉన్న సింధు.. ఈ మ్యాచ్ లో 2-0 తేడా ఆధిక్యంతో పోటీ పడింది. 2018లో చైనా ఓపెన్ లో ఓసారి కవకామీతో ఆడింది. వరల్డ్ నెంబర్ 38వ స్థానంలో ఉన్న కవకామీపై సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఓపెనింగ్ గేమ్ లో జపాన్ షట్లర్ కొంత పోటీ ఇచ్చినా.. రెండవ గేమ్ లో మాత్రం సింధు ఈజీగా దూసుకువెళ్లింది. ఫోర్ హ్యాండ్ అటాకింగ్ రిటర్న్స్ తో పాటు బ్యాక్ హ్యాండ్ ఫ్లిక్స్ తో ఆకట్టుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 17-21, 21-11, 21-19తో చైనా క్రీడాకారిణి హాన్ యూపై విజయం సాధించింది. ఆ గేమ్ 62 నిమిషాల పాటు సాగింది.
ఇక ఈ ఏడాది రెండు సూపర్ 300 టైటిళ్లు గెల్చుకుంది సింధు. ఇందులో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు 500 టోర్నీలో ఫైనల్ కు చేరడంతో విజయం సాధిస్తుందని అంతా ధీమాగా ఉన్నారు.