భారతదేశపు నెంబర్ వన్ షట్లర్, తాజాగా ఇండియాకు తొలి బంగారు పతకం సాధించిపెట్టిన యువ క్రీడాకారిణి పీవీ సింధు మన తెలుగమ్మాయి కావడం తెలుగువారంతా గర్వించదగ్గ అంశం. క్రీడల్లో తన సత్తా చాటిన సింధు సినిమాల్లో నటించబోతోంది అని ఇప్పుడు జోరుగా ఒక వార్త వినిపిస్తోంది. ఇది నిజమేనా లేక కేవలం పుకారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
వివరాల్లోకి వెళ్తే సింధు కోచ్ అయిన బ్యాడ్మింటన్ దిగ్గజ, మన తెలుగువాడైన పుల్లెల గోపీచంద్ గురించి బయోపిక్ రాబోతోంది అంటూ ఎప్పటినుండో వినిపిస్తూనే ఉంది. అప్పట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ, హీరో సుదీర్ బాబు వెండీతెరపై గోపీచంద్ గా కనిపించబోతున్నట్టూ ప్రచారం జరగడమే కాకుండా, ఆ పాత్ర కోసం సుధీర్ బాబు కసరత్తులు మొదలెట్టేశాడనీ అన్నారు. సుధీర్ బాబు కూడా సినీరంగ ప్రవేశానికి ముందు నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఇది విశ్వసనీయమైన సమాచారం కిందే అంతా లెక్కకట్టారు. కానీ ఎందుకనో ఆ వార్త, ఆ సినిమా మరుగున పడిపోయాయి.
ఆ తర్వాత ఒక సందర్భంలో పుల్లెల గోపీచంద్ స్వయంగా ఒకవేళ ఎవరైనా పివి సింధు బయోపిక్ తెరకెక్కిస్తే అందులో తన పాత్రకు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అయితే సరైన న్యాయం చేస్తాడు అని పేర్కొనడం జరిగింది. ఇప్పటికే అక్షయ్ చేసిన ‘ప్యాడ్ మ్యాణ్ నుండి నిన్నటి ‘మిషన్ మంగళ్ వరకూ బయోపిక్స్ వైపు అక్షయ్ ఎంతగా ఆకర్షితుడవుతాడో స్పష్టంగా మనకు తెలుసు. ఇప్పుడు తాజాగా బంగారు పతకం సింధును వరించిన తర్వాత ఈ వార్తలు కాస్తా ఊపందుకోవడమే కాకుండా అక్షయ్ కుమార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేస్తున్నట్టు, అందులో పివి సింధు పాత్రలో స్వయంగా సింధుయే కనిపించబోతున్నట్టు వినిపిస్తోంది.
మరో వైపు అరుంధతి సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడైన సోనూ సూద్ కూడా గత రెండేళ్ళుగా ఈ ప్రాజెక్ట్ పై తాము పరిశోధన్లు, ప్రీప్రొడక్షన్ వర్క్ చేస్తున్నామని, తన నిర్మాణ సార్థ్యంలోనే ఈ సినిమా రాబోతోందని చెప్పడమే కాకుండా గోపీచంద్ పాత్రలో తానే కనిపించబోతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఆ సినిమాలో సింధు పాత్రలో తాప్సీ పన్ను నటించబోతున్నట్టు వినికిడి. ఇంతకీ సింధు తన పాత్ర పోషించడం ద్వారా తెరంగేట్రం చెయ్యబోతోందా లేదా అన్న విషయంలో ఏదైనా అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఒక స్పష్టత రాదు.