– చేసిన పనుల గురించి చర్చ లేదు
– చేయబోయే అభివృద్ధి గురించి చర్చ లేదు
– బీజేపీని తిట్టడానికే ప్లీనరీ పెట్టారా?
– టీఆర్ఎస్ క్యాడర్ ఏమనుకుంటోంది?
– రాజకీయ పండితులు ఏమంటున్నారు?
హైదరాబాద్ లో ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. 33 రకాల వంటకాలతో అదిరిపోయే స్పీచులతో సూపర్ హిట్ సినిమా మాదిరిగా కొనసాగింది. ఇదంతో గాలాబీ గ్యాంగ్ లోని పైస్థాయిలో వినిపిస్తున్న మాటలు. కానీ.. రకరకాల వంటకాలు పెడితే సరిపోతుందా? అసలు.. కేసీఆర్ పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు.. ఏం చెప్పారు? అసలు.. ఏం చెప్పడానికి ఈ ప్లీనరీ ఏర్పాటు చేశారనే గందరగోళంలో కిందిస్థాయి క్యాడర్ ఉన్నట్లుగా రాజకీయ పండితులు చెబుతున్నారు.
ప్లీనరీలో జాతీయ రాజకీయాలపై మాట్లాడిన కేసీఆర్.. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమన్నారు. మరి.. దానిపై కీలక ప్రకటన చేశారా? అంటే అదీ లేదు. సరే.. పార్టీకి సంబంధించి కీలక చర్చ చేశారా? అంటే అదీ జరగలేదు. మరి.. ఈ ప్లీనరీ ఎందుకు పెట్టారని అంటే కేంద్రాన్ని, బీజేపీని తిట్టడానికేనా అనే చర్చ టీఆర్ఎస్ కింది స్థాయి లీడర్ల చర్చ జరుగుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే పార్టీ ప్లీనరీ అంటే నేతల్లో ఎంతో ఉత్తేజాన్ని నింపాలి. ఏడాది పాటు పార్టీ చేపట్టే తీర్మానాలు.. ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల గురించి వివరించాలి. కానీ.. అవేవీ టీఆర్ఎస్ ప్లీనరీలో కనిపించలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఛైర్మన్లు ఇలా వచ్చిన నేతలకు ప్లీనరీ నిరుత్సాహాన్నే మిగిల్చిందనేది విశ్లేషకుల వాదన. ప్రజల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దశ దిశ నిర్దేశించాల్సిన గైడ్ లైన్స్‌ను పూర్తిగా వదిలేసి.. ప్లీనరీలో నాయకులు మాట్లాడారని అంటున్నారు. అంతేకాదు, అసలు ప్లీనరీ ఎందుకు పెట్టారని అసహనం టీఆర్ఎస్ క్యాడర్ లో కనిపిస్తోందని చెబుతున్నారు. కేవలం బీజేపీని తిట్టడానికి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికే ప్లీనరీ పెట్టినట్లు ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే అయితే ఒక మీడియా సమావేశం పెడితే సరిపోయేది కదా అనే టాక్ నడుస్తోందని సెటైర్లు వేస్తున్నారు.
కేసీఆర్ చేసిన తీర్మానాలు కూడా జాతీయ స్థాయి రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే చేసినట్లుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. అయితే.. అవేవీ కూడా పార్టీ నేతల్లో ఉత్తేజాన్ని నింపలేకపోయాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివరకు మంత్రులు కూడా ఉపన్యాసలే ఇచ్చారు తప్ప ఉత్తేజాన్ని నింపలేదనే ఫీలింగ్ లో గులాబీ గ్యాంగ్ ఉన్నట్లు చెబుతున్నారు. దీనివల్ల రోజురోజుకీ ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోందే తప్ప తగ్గదని హెచ్చరిస్తున్నారు. ఉద్యమంతో సంబంధం లేని నేతలు ఉన్నత పదవుల్లో ఉండటం కూడా పార్టీపై అసహనానికి కారణమని విశ్లేషణ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు స్కోప్ లేదనేది విశ్లేషకుల వాదన. ఈ విషయం తెలిసి కూడా దాదాపు 10 గంటల పాటు మాట్లాడటంపై ఆ పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారని అంటున్నారు.
మరోవైపు ప్లీనరీకి వచ్చిన నేతలు సభ మధ్యలో వెళ్లిపోకుండా గట్టి చర్యలే తీసుకున్నారని చెబుతున్నారు విశ్లేషకులు. ఎవరూ వెళ్లిపోకుండా కేసీఆర్ టెలికాన్ఫరెన్స్ పెట్టి క్యాడర్ ను హెచ్చరించారని అంటున్నారు. ఏ క్యాడర్ అయితే ఖాళీ అవుతుందో వారిని సీసీటీవీల్లో గుర్తించి చర్యలు తీసుకుంటామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారని వివరిస్తున్నారు. గతంలో కొంపల్లిలో జరిగిన సమావేశంలో లంచ్ తర్వాత సగం మంది నేతలు వెళ్లిపోయారని.. అది ఈసారి రిపీట్ కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. మొత్తానిక ప్లీనరీ సమావేశం.. టీఆర్ఎస్ క్యాడర్ ను నిరుత్సాహానికే గురిచేసిందని విశ్లేషణ చేస్తున్నారు.