సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆ మేరకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. జాతీయ పార్టీపై దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు ప్రకటన చేస్తామని సీఎం వెల్లడించారు.
దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్త చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా దేశ రాజకీయాల్లోకి అడుగు పెడితే ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే అసలు జాతీయ పార్టీ స్థాపనకు కావాల్సిన అర్హతలు ఏంటీ, ఓ పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు ? అన్న అంశాలను పరిశీలిస్తే…
ఓ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే అది… కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనల ప్రకారం ఆ పార్టీ చివరి సారిగా జరిగిన లోక్ సభ లేదా అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేసి ఉండాలి.
ఆ ఎన్నికల్లో నమోదై చెల్లుబాటైన ఓట్లలో ఆరు శాతం ఓట్లను సదరు పార్టీ సాధించాలి. ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులైనా ఎంపీలుగా ఎన్నికై ఉండాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లోనైనా ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొంది ఉండాలి.
గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను ఆ పార్టీ గెలుచుకొని ఉండాలి. మూడు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు గెలుపొంది వుండాలి. ప్రస్తుత దేశంలో 8 పార్టీలను జాతీయ పార్టీలుగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.