రహదారులు ప్రగతికి చిహ్నాలు. అయితే రాష్ట్రంలో పలుచోట్ల నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు ముచ్చటగా మూడు నెలలు కూడా ఉండటం లేదంటే నాణ్యత డొల్లతనం.. అవినీతి మయం ఎంతుందో అద్దం పడుతోంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్ గ్రామం పక్కనే వాగుపై నిర్మించిన లోలెవల్ వంతెన కాంట్రాక్టర్ల కక్కుర్తి.. అధికారుల అవినీతికి చిహ్నంగా నిలిచింది. వంతెన నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడంతో భారీ వర్షానికి కూలిపోయింది.
భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. అత్యధిక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కామారెడ్డి జిల్లాను సైతం వానలు ముంచెత్తాయి. అయితే సిర్పూర్ గ్రామ శివారులోని వాగుపై గత రెండు నెలల కింద 30 లక్షల రూపాయలతో నిర్మించిన వంతెన ఒక్క భారీ వర్షానికే కూలిపోవడంపై గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. నాసిరకంగా పనులు చేపట్టడం వల్లే అనతికాలంలోనే వంతెన కుంగిపోయిందని ప్రజలు చెబుతున్నారు.
మరోవైపు వంతెన నిర్మాణ పనుల్లో వాడే కంకరలో నాణ్యత లేకపోవడంతో నాసిరకంగా తయారైనట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ప్రజల ప్రాణాలకే ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. వంతెనలు ప్రజావసరాలకు ఉపయోగకరంగా ఉండాలే తప్ప.. ప్రమాదకరంగా కాదంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు.
అయితే, ఇది జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సొంత గ్రామం కావడం విశేషం. ఎంపీ స్వగ్రామంలోనే అభివృద్ధి పనుల్లో ఇంత దారుణంగా డొల్లతనం కనపడటంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.