రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ప్రజాస్వామ్యంపై రాహుల్ వ్యాఖ్యలను కర్ణాటక ప్రజల పై దాడిగా ఆయన అభివర్ణించారు. బ్రిటీష్ నేల నుంచి భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.
కర్ణాటకలోని మాండ్యలో ప్రధాని మోడీ ఈ రోజు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఆ వ్యక్తులు రాష్ట్ర, దేశ ప్రజల్ని, భగవాన్ బసవేశ్వరున్ని అవమానిస్తున్నారన్నారు. ప్రపంచం మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అధ్యయనం చేస్తోందన్నారు.
భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు ప్రజాస్వామ్యాని తల్లి వంటిది అని చెప్పేందుకు మన దగ్గర ఎన్నో అంశాలున్నాయని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తి ఏదీ లేదని ఆయన చెప్పారు. దేశ ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు కొందరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు.
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో సహా పలువురు రాజకీయ నాయకులు నిఘా నీడలో ఉన్నారని రాహుల్ గాంధీ ఇటీవల అల్మా మేటర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.