అమీర్‌పేట స్టేషన్లో పెచ్చులూడిన ఘటన మెట్రో రైల్ సంస్థ నిర్లక్ష్యమేనని మరోసారి రుజువైంది. అమీర్‌పేట్ ఘటన జరిగిన మరుసటి రోజే మరో స్టేషన్లో పెచ్చులూడాయి. హెచ్ఎంఆర్ కేంద్ర కార్యాలయానికి ఆనుకొని ఉన్న రసూల్‌పుర మెట్రో స్టేషన్ దగ్గర కూడా పెచ్చులూడాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగపోయినా అసలు మెట్రో స్టేషన్లు, మెట్రో ట్రైన్ మార్గాల్లో ప్రజల భధ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెచ్చులూడే సమయంలో అక్కడ కూడా ఎవరైనా ఉంటే మౌనికలాగే మరొకరి ప్రాణం బలయ్యేది. దీనిపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
అయితే, పుండు మీద కారం చల్లినట్లు.. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మాత్రం తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన పోస్టు అందరూ మండిపడేలా చేసింది. హైదరాబాద్ మెట్రో కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, చాయ్ తాగి ఉల్లాసంగా గడపొచ్చు అంటూ ఓ పోస్ట్ పెట్టింది.
ఓవైపు మౌనిక మృతదేహంతో బంధువులు రోదిస్తుంటే, భాద్యతగా ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పాల్సిన సంస్థ ఇలా చాయ్ కోసం ప్రమోషన్స్ చేయటం ఏంటని ప్రయాణికులు మండిపడుతున్నారు.
అయితే, మొత్తం ఎపిసోడ్‌పై ఎట్టకేలకు ప్రభుత్వం నోరు విప్పింది. మెట్రో భద్రతపై వెంటనే ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ చేయించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినట్లు సంస్థ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల భధ్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హమీ ఇచ్చింది. మౌనిక మృతికి నష్ట పరిహారంగా 20 లక్షల ఎల్&టీ అందించినట్లు తెలిపారు.