ట్రాఫిక్ ఆంక్షల పేరుతో పోలీసులు చేస్తున్న ఆగడాలకు అడ్డూఅదుపు ఉండడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. సిగ్నళ్ల దగ్గర, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ట్యాబ్ లు పట్టుకుని ఫైన్లు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. తాజాగా యాదాద్రి పోలీసుల అత్యుత్సాహంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో పంచ్ లు ఓ రేంజ్ లో పేలుతున్నాయి.
టార్గెట్ రీచ్ అవ్వాలన్న తపనతో ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోందని అంటున్నారు నెటిజన్స్. వాహనదారులకు చలాన్లు వేయడం.. జేబు ఖాళీ చేయడం రోజువారీ తంతుగా మారిపోయిందని విమర్శిస్తున్నారు. జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన దంపతులు తమ మూడు మాసాల చిన్నారిని చికిత్స కోసం అద్దె కారులో హైదరాబాద్ తీసుకెళ్తున్న సమయంలో యాదాద్రి పోలీసులు చూపిన నిర్లక్ష్యం క్షమించరానిదని అంటున్నారు.
డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదని పెండింగ్ చలాన్లు చెక్ చేసి.. ఆ డబ్బులు కడితేనే పంపుతామని చెప్పడంపై మండిపడుతున్నారు నెటిజన్స్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేస్తున్నారు. చీటికిమాటికి ట్విట్టర్ లో హడావుడి చేసే చినసారు.. ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇటు మరికొందరు పోలీసులు అలా మారడానికి ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కూడా ఓ కారణం అయి ఉండొచ్చని కామెంట్లు పెడుతున్నారు.
ఇటు పోలీసుల వల్లే తమ బిడ్డ చనిపోయిందని వాపోతున్నారు తల్లిదండ్రులు. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని చెబుతున్నారు. దాదాపు అరగంట సేపు డ్రైవర్ తో పోలీసులు వాగ్వాదానికి దిగారని.. ఆలస్యం కావడంతో తమ బిడ్డ చనిపోయిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయంటూ ఆరోపిస్తున్నారు. నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స ప్రారంభించే సమయంలో చిన్నారి మరణించినట్టుగా డాక్టర్లు చెప్పినట్లు వివరించారు. కనీసం 10 నిమిషాల ముందు తీసుకొచ్చినా బతికేదని చెప్పారన్నారు. అయితే.. పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. కారులో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉందని చెప్పలేదని వారు అంటున్నారు.