ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో దేశి రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటా మిర్చి ధర రూ. 45,000 అయింది. కొద్ది రోజుల క్రితం ఇదే మార్కెట్లో దేశి రకం మిర్చికి ధర రూ.44,000 ఉండగా.. సోమవారం అది రూ. 45 వేలకు చేరింది.
మార్కెట్ చరిత్రను తిరగరాస్తూ ఆల్ టైం రికార్డు కొనసాగిస్తుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘణపూర్ మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన ఓడే లింగేశ్వర్ రావు అనే రైతు 24 బస్తాల దేశి మిర్చి మార్కెట్ కు తీసుకొచ్చాడు.
అతని పంట క్వింటాకు రూ.45వేలు పలికిందని వెల్లడించారు. అదే బాటలో పత్తి ధర కూడా పరిగెడుతుందని పేర్కొన్నారు.
ఇదే మార్కెట్లో పెరుకపల్లి గ్రామానికి చెందిన అంకటి రాజ్ కుమార్ తీసుకువచ్చిన 40 బస్తాల పత్తి.. క్వింటాకు రూ.10,720లు చేరుకుంది. మిర్చి, పత్తి ధరలు దండిగా పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.