అదిగో.. ఇదిగో… తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తున్నామంటూ ఊరించి చివరికి ఉస్సురూమనిపించిన కాంగ్రెస్ అధిష్టానానికి రివర్స్ షాక్ తగులుతోంది. ఆలస్యం అమృతం విషమన్నట్టుగా.. పీసీసీ చీఫ్ వాయిదా వేసినందుకు ఫలితాన్ని అనుభవిస్తోంది. పీసీసీ చీఫ్ ఎంపికలో జాప్యాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత…హస్తానికి చివరి నమస్తే పెట్టబోతున్నారు.
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, ఇతర పదవులకు రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని కూన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాటంలోనే కాదు.. చివరికి సొంత ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాడలేదని ప్రజలు భావిస్తున్నారన్న ఆయన.. అంతర్గత కుమ్మలాటల వల్లే పీసీసీ చీఫ్ ఎంపికలో జాప్యం జరుగుతున్నదని విమర్శించారు. బీజేపీలో భవిష్యత్‌ను వెతుక్కుంటున్నట్టు చెప్పారు. కాగా కూన దారిలోనే మరికొందరు నేతలూ ఉన్నారని తెలుస్తోంది. కొత్త పీసీసీ చీఫ్‌ని ప్రకటించకపోతే.. తమ దారి తాము చూసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.