ప్రజాస్వామ్య దేశంలో ‘ధన స్వామ్యం’ నడుస్తుందన్నారు ఆర్ కృష్ణయ్య గౌడ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగే చట్ట సభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు ఉద్యమం చేస్తామని పిలుపునిచ్చారు. 14 శాతమే ఇప్పటివరకు బీసీలకు అవకాశాలు ఉన్నాయని, బీసీలకు అవకాశం రానప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని అన్నారు.
బీసీ బిల్లు పెట్టేవరకు పోరాటం ఆగదని చెప్పారు. పార్టీలకు అతీతంగా బీసీలు తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య. దేశ సంపదలో బీసీల భాగస్వామ్యం ఎక్కువ.. కానీ రాజ్యాంగ పరంగా న్యాయమైన వాటా రావడం లేదన్నారు. బీసీల అభివృద్ధి అడ్డుకుంటే బీసీ కుల సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల ప్రతి కుటుంబానికి రూ.50 లక్షల సబ్సిడీ బుణాలు ఇవ్వాలని కోరారు. రాజకీయ అవసరాల కోసం బీసీలను వాడుకుంటున్నారని, బీసీలు బానిసత్వం వదలాలన్నారు. ఏప్రిల్ 3న ఛలో ఢిల్లీ, పార్లమెంట్ ముందు ధర్నా విజయవంతం చేయాలని తెలిపారు ఆర్ కృష్ణయ్య.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, డాక్టర్ రామ్మూర్తి, బోల్క వెంకట్ యాదవ్, గందాసిరి కిషోర్ కుమార్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.