దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం వరుసగా పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను కైవసం చేసుకుంది. దీంతో ఆస్కార్ రేసులో నిలిచింది. ఇప్పటికే నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ కోసం షార్ట్ లిస్టులో ఎంపికైంది.
అయితే ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ రేసులో జూనియర్ ఎన్టీఆర్ కూడా నిలుస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాగజైన్ వెరైటీ ఈ విషయం గురించి తెలిపింది. తాజాగా ఈ జాబితాలో యూఎస్ఏ టుడే అనే అమెరికన్ పబ్లికేషన్ కూడా చేరిపోయింది.
జూనియర్ ఎన్టీఆర్ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ రేసులో నిలుస్తారని యూఎస్ఏ టుడే ఊహించింది. ఆస్కార్ కోసం పోటీ పడేవారిలో అతడు హాటెస్ట్ కంటెండర్ అని స్పష్ట చేసింది. బెస్ట్ యాక్టర్ విభాగంలో ఓటు వేయడానికి ఆర్ఆర్ఆర్‌లో కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటనను అకాడమీ గుర్తించకుండా ఉండదని వెబ్‌సైట్ అంచనా వేసింది. ఇప్పటికే వెరైటీ మ్యాగజైన్ కూడా ఈ విషయాన్ని ఊహించగా.. తాజాగా యూఎస్ఏ టుడే కూడా ఉత్తమ నటుడిగా తారక్ ఉంటాడని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే ఇటీవలే బాఫ్తా అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి నామినేషన్ దక్కని విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రాజమౌళి.. తన సినిమాలను డబ్బు సంపాదన కోసం తీస్తానని, కేవలం అవార్డులు గెలవడం కోసం తీయనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది తారక్ నటిస్తున్న 30వ సినిమా కావడం గమనార్హం. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే జనతా గ్యారేజ్ సూపర్ సక్సెస్ కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 సినిమాకు కూడా శ్రీకారం చుట్టారు.