రా.. రా మూవీ రివ్యూ

సినిమాపేరు : రా..రా
విడుదల తేదీ : 23 02 2018
జానర్‌ : కామెడీ హారర్‌
మ్యూజిక్ : ర్యాప్‌ రాక్‌ షకీల్‌
ఎడిటింగ్ ‌: శంకర్‌
నిర్మాత : ఎం.విజయ్‌
బ్యానర్: విజి చెరీష్‌‌ విజన్స్‌
దర్శకత్వం: శంకర్‌
నటీనటులు: శ్రీకాంత్‌, నజియా, వేణు, చమ్మక్‌ చంద్ర, అలీ, పృథ్వీ, షకలక శంకర్‌, సీతానారాయణ, జీవా, గెటప్‌ శ్రీను, పోసానీ కృష్ణమురళీ, రఘుబాబు తదితరులు

ఫ్యామిలీ హీరోగా మంచి పేరుతెచ్చుకున్న శ్రీకాంత్ ఇటీవలకాలంలో హీరోగా చేసిన సినిమాలు చాలా తక్కువ. అప్పుడప్పుడు సహాయనటుడుగా కనిపిస్తున్నాడంతే. తాజాగా ‘రా.. రా’ సినిమాతో మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఈసారి కామెడీ హారర్ జానర్ ఎంచుకున్నాడు. ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ : రాజ్‌కిరణ్‌ ( శ్రీకాంత్‌) తండ్రి ( గిరిబాబు) సక్సె్స్ ఫుల్ మూవీ డైరెక్టర్. గిరిబాబు తీసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టరే. గొప్ప దర్శకుడిగా గిన్నిస్‌ రికార్డు కూడా సొంతంచేసుకుంటాడు. అతని కొడుకు రాజ్ కిరణ్ కూడా డైరెక్టర్ కావాలనకుంటాడు. దీంతో నిర్మాతలంతా క్యూకట్టి సినిమా నిర్మిస్తామంటూ వెంటపడతారు. అయితే, రాజ్ కిరణ్ తీసిన మూడు సినిమాలూ అట్టర్ ప్లాప్ అవుతాయి. చివరకు తండ్రి గిరిబాబే ప్రొడ్యూసర్ గా మారి రాజ్ కిరణ్ చేత మరో సినిమా చేయిస్తాడు. ఇదీ డిజాస్టర్ కావడంతో గుండె ఆగి చనిపోతాడు. తండ్రి మరణంతో తల్లికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. తల్లిని బతికించుకోవాలంటే ఆమెకు సంతోషం కలిగే పనిచేయాలని డాక్టర్లు సలహా ఇస్తారు. దీంతో ఒక్క హిట్‌ సినిమా అయినా తీసి తల్లి కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటాడు. ఇందుకు హారర్ కామెడీ జానర్ ఎంచుకుని ఒక బంగ్లాలోనే కథ రాసుకుని అక్కడే షూట్ చేస్తాడు. ఈ క్రమంలో రాజ్ కిరణ్ సజావుగా సినిమా తీశాడా? అక్కడ దర్శకుడితోపాటు నటీనటులుకు ఎదురైన సినిమా కష్టాలేంటి? చివరికి రాజ్ కిరణ్ తన తల్లిని సంతోషపెట్టగలిగాడాన్నదే సినిమా.

విశ్లేషణ : దెయ్యాల సినిమా అంటే.. అవి భయపెడతాయని భావిస్తాం. అయితే, మనుష్యుల్ని చూసి దెయ్యాలు భయపడ్డం ఇక్కడ పాయింట్. ఈ తరహా స్టోరీ వింతైనదే అయినప్పటికీ ఇంతకుముందు వచ్చిన ‘ఆనందోబ్రహ్మ’ సినిమా కూడా ఇలాంటిదే. సరే.. కథను, కథనాన్ని దర్శకుడు ఎలా నడిపించాడన్న విషయానికొస్తే.. కావల్సినంత కామెడీని పండించే అవకాశమున్న ఈ జానర్ లో దర్శకుడు అట్టర్ ప్లాప్ అయ్యాడనిపిస్తుంది.

ఒకటి.. అరా.. తప్ప మిగతా ఏ సన్నివేశం కూడా తెరపై రక్తికట్టదు. హీరోతోపాటు నవ్వులు పూయించగల అనేకమంది హాస్యనటులున్నప్పటికీ సినిమాలో హాయిగా నవ్వుకునే పరిస్థితి లేదు. కథనం.. సన్నివేశాల్లో ఎక్కడా బలం లేకపోవడంతో హీరోసహా నటీనటులంతా తేలిపోయారు. ఒక్క పృథ్వీ నటించిన సన్నివేశాలు తప్ప ఏ సీనూ మనసుకు హత్తుకునేలా లేదు. సినిమా మొత్తం అతుకులబొంతలా.. నీరసంగా సాగే సన్నివేశాలతో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. హీరోయిన్ల పాత్రలను సైతం ఆకర్షణీయంగా చూపించలేకపోయాడు డైరెక్టర్. అలీ, రఘుబాబు, హేమ, షకలక శంకర్‌.. వంటి వాళ్ల శ్రమ వృథా ప్రయేసే అయింది.

ఎండ్ కార్డ్ : పోస్టర్ ‘రా..రా’ అంటే.. సినిమా పో..పో అంది.