ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల కోసం ఈ సారి తీవ్రమైన పోటీ ఉండనుంది. ఎలాగైనా ప్రసారహక్కులను దక్కించుకోవాలని దిగ్గజ మీడియా సంస్థలు ఆరాటపడుతున్నాయి. ఇప్పటికే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ)కి డిస్నీ హాట్ స్టార్ టెక్నికల్ బిడ్లు సమర్పించింది.
దీంతో పాటు భారత్ లో ప్రసార హక్కుల కోసం సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా(ఎస్‌పీఎన్), జీ ఎంటర్ టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్(జీ),వయాకామ్18 మీడియా సంస్థలు, ప్రపంచ వ్యాప్తంగా హక్కుల కోసం టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ ఏషియాలు బిడ్లు దాఖలు చేశాయని బీసీసీఐ వెల్లడించింది.
రాబోయే ఐదేండ్ల(2023-27)కు ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల కోసం ఈ వేలాన్ని జూన్ 12న బీసీసీఐ నిర్వహించనుంది. అమెరికన్ టెక్ దిగ్గజం అమెజాన్, గూగుల్ లు ఈ వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. మొదట్లో మీడియా ప్రసార హక్కుల కోసం ఈ సంస్థలు ఆసక్తికనబరిచాయి.
కానీ ఈసారి వేలాని దూరంగా ఉండాలని చివరి క్షణంలో నిర్ణయించాయి. అందుకే టెండర్ ఫారమ్ పొందినప్పటికి టెక్నికల్ బిడ్లు ఈ రెండు దిగ్గజ సంస్థలు దాఖలు చేయలేదు. అధిక రిజర్వ్ ధర, నాన్-ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ రైట్స్ వంటివి ప్రముఖ దిగ్గజ కంపెనీల ఆసక్తిని తగ్గించాయని ఓ స్పోర్ట్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు.