ఆస్ట్రేలియాలో జాతి వివక్ష ! ఓ భారతీయ విద్యార్థిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు.., 11 సార్లు పొడిచి పారిపోయాడు. న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో పీ హెచ్ డీ చేస్తున్న 28 ఏళ్ళ శుభం గార్గ్ అనే విద్యార్ధి ప్రస్తుతం విషమ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 6 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆగ్రాలో ఉంటున్న ఇతని తలిదండ్రులు ఈ సమాచారం తెలిసి షాక్ కి గురయ్యారు. తమ కొడుకుపై జాతి వివక్ష తోనే దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. అతడ్ని చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీసా కోసం వారం రోజులుగా ఎదురు చూస్తున్నామని, ఇప్పటివరకు రాలేదని వారు తెలిపారు.
శుభం గార్గ్ ఐఐటీ మద్రాస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందాడు. సెప్టెంబరు 1 న ఆస్ట్రేలియా వెళ్ళాడు. దుండగుని దాడిలో తమ కొడుకుకు ముఖం, ఛాతీ, పొత్తికడుపుపై గాయాలయ్యాయని గార్గ్ తలిదండ్రులు తెలిపారు. దాడికి పాల్పడిన 27 ఏళ్ళ యువకుడిని హత్యా యత్నం ఆరోపణపై పోలీసులు అరెస్టు చేశారు.
తమ కుమారుడు గానీ, అతని స్నేహితులు గానీ ఇది జాతివివక్షా పూరిత దాడి అని ఏ మాత్రం భావించలేదని గార్గ్ తండ్రి రామ్ నివాస్ గార్గ్ చెప్పారు. ఆ దుండగుడెవరో కూడా వారికి తెలియదన్నారు. శుభం గార్గ్ పేరెంట్స్ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు అక్కడి భారతీయ ఎంబసీ అధికారులను సంప్రదిస్తున్నామని ఆగ్రా జిల్లా కలెక్టర్ నవనీత్ చాహల్ తెలిపారు,