జమ్మూ కశ్మీర్ లో 192 కి.మీ. పొడవునా ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో గల సొరంగాల్లో తనిఖీకి రాడార్ అమర్చిన డ్రోన్లను వినియోగించాలని ఆర్మీ నిర్ణయించింది. ఈ సొరంగాల్లో కనబడనివి కూడా చాలా ఉన్నాయని, ఉగ్రవాదులు వీటిని వినియోగించుకోకుండా చూసేందుకు అధునాతన రాడార్ డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం వినియోగించుకోవడం ప్రారంభించిందని సైనిక వర్గాలు తెలిపాయి, మొట్ట మొదటిసారిగా వీటిని రక్షణ రంగంలో ప్రవేశపెట్టారు.
ముఖ్యంగా జమ్మూ రీజన్ లోని భారత-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో భూగర్భ టన్నెల్స్ చాలా ఉన్నాయి. అక్రమ ఆయుధాలను, మాదకద్రవ్యాలను రవాణా చేయడానికే గాక.. భారత భద్రతా దళాల దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు పాక్ ఉగ్రవాదులు ఇటీవలికాలంలో వీటిని ఎక్కువగా వినియోగించుకుంటున్నట్టు వెల్లడైంది.
ఈ కారణంగా దేశీయంగా తయారైన ఆధునిక రాడార్ డ్రోన్లను ఉపయోగించుకోవడానికి నడుం బిగించారు. 192 కి.మీ. పొడవునా గల భూగర్భసొరంగాల్లో కనీసం ఐదింటిని మన జవాన్లు కనుగొన్నారని సైనికవర్గాలు పేర్కొన్నాయి. 2020 లో రెండింటిని, గత ఏడాది మరో మూడింటిని కనుగొన్నట్టు వెల్లడించాయి.
ఇవన్నీ జమ్మూ లోని ఇంద్రేశ్వర్ నగర్ సెక్టార్ లో ఉన్నాయని, జవాన్లు ఏ క్షణమైనా గస్తీకి రావచ్చునని, తమపై దాడికి దిగవచ్చునని భావించినప్పుడు ఉగ్రవాదులు ఈ సొరంగాల్లో దాక్కోవడం కూడా జరుగుతోందని తెలిపాయి. ఈ డ్రోన్లు సొరంగాల్లోకి చొచ్ఛుకు పోయి.. సమాచారాన్ని అందజేయగలవట. దీన్ని ‘యాంటీ టనెలింగ్ ఎక్సర్ సైజ్’ గా పేర్కొంటున్నారు. దుర్భేద్యమైన సొరంగాల్లో తనిఖీకి రాడార్ డ్రోన్ల ఉపయోగం చాలా ఉంటుందని భావిస్తున్నారు.