ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాకు ఎప్పటికప్పుడు కత్తెర్లు పడుతున్నాయి. అవును.. ఈ సినిమా నిడివిని ఎప్పటికప్పుడు తగ్గించేస్తున్నారు. చివరికి సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని క్లిప్పింగులు తొలిగించి సంచలనానికి తెరలేపారు మేకర్స్. దీంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది.
సెన్సార్ కు ముందు రాధేశ్యామ్ నిడివి అక్షరాలా 2 గంటల 45 నిమిషాలు. సెన్సార్ కు వెళ్లేసరికి ఈ సినిమా 2 గంటల 30 నిమిషాలకు తగ్గింది. అంటే, అప్పటికే 15 నిమిషాలు ట్రిమ్ చేశారన్నమాట. అలా రెండున్నర గంటల రన్ టైమ్ లో సెన్సార్ పూర్తిచేశారు. సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ప్రింట్స్ కూడా వెళ్లిపోయాయనుకున్న టైమ్ లో, ఊహించని విధఁగా మరో ట్విస్ట్.
సెన్సార్ పూర్తయిన 2 గంటల 30 నిమిషాల రన్ టైమ్ నుంచి కూడా కొన్ని సన్నివేశాల్ని తొలిగించారు. ఆఖరి నిమిషంలో రాజమౌళిని కూర్చోబెట్టి మరోసారి ఎడిటింగ్ చేశారట. అలా 2 గంటల 18 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అవుతుంది రాధేశ్యామ్.
ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణకుమార్ డైరక్ట్ చేశాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది.