మొన్నటివరకు చిన్న సినిమాలు మాత్రమే రూల్స్ ను పక్కనపెట్టాయి. ఫిలిం ఛాంబర్ విధించిన 7 వారాల లాక్-ఇన్ పీరియడ్ ను కాదని రిలీజైన కొన్ని రోజులకే ఓటీటీకి తమ సినిమాల్ని ఇచ్చేసేవారు చిన్న నిర్మాతలు. వాళ్ల కష్టాలు వాళ్లవి. వాటిని టాలీవుడ్ కూడా అర్థం చేసుకునేది. పెద్ద హీరోలు, నిర్మాతలు మాత్రం ఈ నిబంధనను పాటించాయి. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా నిబంధనలు ఉల్లంఘించలేదు. కానీ రాధేశ్యామ్ మాత్రం వాటిని పట్టించుకోలేదు.
మార్చి 11న విడుదలైన ఈ సినిమా, ఏప్రిల్ 1న ఓటీటీలోకి వచ్చేస్తోంది. అంటే కనీసం నెల రోజులు కూడా ఈ సినిమా ఆగలేదన్నమాట. ఇంకా చెప్పాలంటే నిబంధనలకు విరుద్ధంగా 4 వారాల ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఓ పెద్ద సినిమానే ఇలా వ్యవహరిస్తే, భవిష్యత్తులో ఇక మిగతా సినిమాల్ని ప్రశ్నించే హక్కు ఎక్కడ్నుంచి వస్తుంది.
టాలీవుడ్ లో ఎప్పుడూ ఇంతే. అన్నింటికీ రూల్స్ చేస్తారు. కానీ కొందరు మాత్రమే పాటిస్తారు. మరికొంతమంది రూల్స్ ఉన్నాయనే విషయాన్నే పట్టించుకోరు. ఇంకొంతమంది రూల్స్ బ్రేక్ చేయడానికే తామున్నాం అన్నట్టు వ్యవహరిస్తారు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు కూడా ఆ బ్యాచ్ లో చేరిపోవడం బాధాకరం.
ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. అటు ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం నిబంధనల ప్రకారం, 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలోకి వస్తుంది. తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.