ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే అమెజాన్ ప్రైమ్ లో కూడా ఇది ప్రత్యక్షమైంది. అక్కడ కూడా ఏమంత పెద్ద రెస్పాన్స్ రాబట్టలేకపోయింది. ఇక రేపోమాపో జీ తెలుగు ఛానెల్ లో ఈ సినిమా ప్రసారం అవుతుంది. ఎంత రేటింగ్ వస్తుందనేది తర్వాత సంగతి.
ఈ గ్యాప్ లో ఊహించని విధంగా ట్రెండ్ అయింది ఈ సినిమా. ఈ సినిమా హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ లో పెట్టారు. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాదాపు 25 రోజులుగా నెట్ ఫ్లిక్స్ టాప్-10 ట్రెండింగ్ లో ఇది కొనసాగుతూ వస్తోంది. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో 3 వారాలకు పైగా కొనసాగేవి హాలీవుడ్ చిత్రాలు, ఇంగ్లిష్ వెబ్ సిరీస్ మాత్రమే. అలాంటిది రాధేశ్యామ్ సినిమా 25 రోజులుగా ట్రెండింగ్ లో ఉంది.
ప్రభాస్ కు నార్త్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే రాధేశ్యామ్ సినిమాను వాళ్లు థియేటర్లలో చూడ్డానికి ఇష్టపడలేదు. రిలీజైన 2 రోజులకే ఫ్లాప్ టాక్ వచ్చేయడంతో మిగతా వాళ్లంతా వెనక్కుతగ్గారు. అలాంటి వాళ్లంతా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన రాధేశ్యామ్ వైపు మొగ్గుచూపారు. అలా నార్త్ ఆడియన్స్ అంతా కలిసి రావడంతో నెట్ ఫ్లిక్స్ లో రాధేశ్యామ్ సూపర్ హిట్టయింది.
ప్రభాస్ హీరోగా నటించిన ఈ లవ్ స్టోరీలో పూజాహెగ్డే హీరోయిన్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించాడు. దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చింది.