ఈ దేశంలో ఆర్థిక మాంద్యం విస్తరిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఉపాధి లేక, లేదా కోల్పోయి అల్లాడి పోతున్నారు. పార్లే లాంటి సంస్థలు కారికుల్ని తొలగించి పరిశ్రమలు మూసేస్తున్నారు. మహేంద్ర & మహేంద్ర గ్రూప్ కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉత్పత్తి కుదిస్తున్నారు. దేశవ్యాప్తంగా పరిశ్రమలు మూత పడుతున్నాయి. కానీ, ప్రభుత్వ రంగ పరిశ్రమలను మాత్రం కార్పొరేట్లకు కట్టబెడున్నారు. ఒక ముఖేష్ అంబానీ నుంచే జాతీయ బ్యాంకులకు లక్షన్నర కోట్లు మొండి బకాయి ఉంది. కానీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకును రికవరీ చేయమని అడగదు. అడిగినా రికవరీ చేయడానికి అనుమతి ఇవ్వదు. ఇటీవల 1.76 లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకు నుంచి తీసుకున్న సొమ్ముఈ కార్పొరేట్లకే ఇచ్చే ఉద్దేశం కనిపిస్తుంది. రైల్వే తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను జియోకు కట్టబెట్టింది. ONGC వెలికితీసిన బావుల్నిచేజిక్కించుకుని ఆయిల్ నిక్షేపాలను ఎన్నాళ్ళో నుంచో కాజేస్తున్నది ముఖేష్ అంబానీ గ్రూప్. కేంద్రంలో ఒకప్పుడు యూపీఏ సర్కార్ ఇలానే దేశ సంపదను తీసుకెళ్లి అంబానికి కట్టబెట్టింది. ఇహ ఇప్పుడు మోడీ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా దోచి పెడుతోంది. ఇంకా ఇలా పొందిన సంపాదనతో ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుడు అయ్యాడు. ఆయన నెల వారి జీతమే 15 కోట్లు. మన దేశంలో ప్రధమ పౌరుడు రాష్ట్రపతి కంటే ఎక్కువ జీతం ఉండకూడదు. కానీ, ముఖేష్ అంబానీ జీతం ఎన్ని రెట్లో మనకు తెలుసు. నోట్ల రద్దులో కూడా వీరెవరికీ ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదు, సామాన్యులకు తప్ప. 

ఈ కుబేరుల ఆదాయంపై ఈడీ, ఐటీ తదితర సంస్థలు ఏనాడూ ఎటువంటి దాడులూ చేయవు. యథేచ్ఛగా వీరంతా కలిసి లక్షల కోట్ల రూపాయలు వెనకేస్తారు. బ్యాంకులను, ప్రభుత్వ ఖజానాను ముంచుతారు. ముఖేష్ అంబానీ కరెంటు బిల్లు వేల కోట్లతో ఉంది. 200 కోట్లతో కృష్ణుడు విగ్రహం చేయడంలో వింతేం వుంది..? ముందు ముందు వీళ్లు తమ ఇళ్లని కూడా ఎంచక్కా బంగారంతో చేసిన ఇటుకలతో కట్టేసి ‘మీ ఇల్లు బంగారం గానూ..’ అనే సామెతను నిజం చేసేస్తారు. అప్పుడు ప్రభుత్వ పెద్దలు వారికి పూల బొకేలు పంపించి అభినందనలు తెలియజేస్తారు. నాలాంటి విశ్లేషకులెవరో దీని గురించి పుంఖానుపుంఖాలుగా రాస్తే.. సామాన్యులు వాటిని కథలు కథలుగా చెప్పుకుంటారు. వినేవాళ్లు ఔరా అనుకుంటారు.ఇదండి సంగతి..