సయ్యద్ రఫీ. రాజకీయ విశ్లేషకులు
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు అమలు చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. నవరత్నాలలో సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా ఒకటి. ఈనెల ఒకటో తేదీ నుంచి దీన్ని పైలెట్ ప్రాజెక్ట్ క్రింద కొన్ని జిల్లాలో ప్రారంభించింది. అక్టోబర్2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అందులో 1) ప్రభుత్యమే మద్యం అమ్మకాలు చేపట్టాలని.. 2) 20% షాపులు తగ్గించాలని.. 3) బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాలని.. 4) ధరలు 20% పెంచాలని తద్వారా వినియోగదారులకు మద్యం కొనుగోలు భారంగా మార్చాలని.. 5) అంతిమంగా ఐదవ సంవత్సరం కేవలం స్టార్ హోటళ్లకే పరిమితం చేయాలనేది ప్రభుత్వం ప్రణాళిక. అదే సమయంలో మద్యానికి బానిసలుగా మారిన వారిని మార్చటానికి రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటుచేసి వారిని సాధారణ పౌరులుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వై.స్.జగన్ ముందుకు చెబుతున్నారు. ఇదంతా మీకు తెలిసిందే.
ఐతే.. ఈ ప్రభుత్వ పధకం అమల్లో వచ్చే సమస్యలు ఒక్కసారి పరిశీలిద్దాం. గతంలో కూడా NT రామారావు ప్రభుత్వం ఏకకాలంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుపర్చింది. మొదట్లో కొంత మంచి ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత మిశ్రమ ఫలితాలను నమోదయ్యాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇది అమల్లో ఉన్నా పక్క రాష్ట్రాల నుంచి దొంగచాటుగా రవాణా ప్రారంభమైంది. ఏక్సైజ్ సిబ్బంది, పోలీసులు దీన్ని అరికట్టడంలో విఫలమయ్యారు.పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఫలితంగా అక్రమ మద్యం సరఫరా ఆగలేదు. మద్యపాన ప్రియులు మళ్ళీ దొరకదనే వాతావరణంలో ఎక్కువ ఖరీదుకు మద్యం సీసాలు కొని త్రాగేవారు. ఇదో ఘనకార్యంగా కూడా భావించేవారు. కొందరు సేవిస్తూ.. లేక కొని తెచ్చుకుంటూ అధికారులకు దొరికి వేలకు వేలు జరిమానాలు చెల్లించుకునే వారు. ఇందులో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే అధికంగా ఉండేవారు. మద్యం సేవించటానికి అప్పట్లో ఇన్ని అవస్థలు పడ్డారు. నిషేధం లేనప్పుడు కంటే ఎక్కువ డబ్బు మద్యం సేవించటానికి ఖర్చు పెట్టేవారు. దాంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి అతులాకుతలం అయ్యింది. మొదట్లో ఏ మహిళలైతే దీన్ని హర్షించారో తర్వాత తరవాత వాళ్లే వ్యతిరేకంగా మారారు. తమ భర్తలు డబ్బులు ఎక్కువగా తగలేస్తున్నారని, శిక్షలు అనుభవిస్తున్నారని విమర్శలు చేశారు. ఇక శ్రామికులు, రోజు వారి పనులు చేసుకునే వారు అక్రమ రవాణా ద్వారా వచ్చే మద్యం కొనలేక అగచాట్లు పడే వారు. దాంతో వీరి కోసం నగర శివార్లలో, గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలు వెలిశాయి. ఇక వారికి చౌకగా నాటుసారా దొరికేది. ఒక దెబ్బతో రెండు పిట్టల్లా మద్యం మాఫియా తయారయ్యింది. వారు సమాంతర వ్యవస్థను నెలకొల్పి ప్రభుత్వ అధికారులను శాసించే స్థాయికి వెళ్లారు. ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోవటం, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రావటంతో కొన్నాళ్ళు ఈ పరిస్థితి కొనసాగించి ఇక లాభం లేదని ప్రభుత్వ ఆదాయం కోల్పోయి, అది ప్రయివేట్ వ్యక్తుల జేబుల్లోకి పోతుందని గ్రహించారు. అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యం నెరవేరదని, కొత్త మద్యం మాఫియాతో సమాజానికి ప్రమాదమని తెలుసుకుని దాని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
మళ్ళీ ఇటీవల జగన్ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో దఫాలవారీగా సంపూర్ణ మద్యనిషేధం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక ప్రయోగానికి పూనుకున్నారు. నిజానికి గతంలో మాదిరే ఇప్పుడు కూడా అమలులో అనేక ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం. ఒకటి బార్లకు అనుమతి ఇస్తారా లేదా తెలియదు. ఇప్పుడున్న పద్ధతిలో షాపు వెనుకనే మినీ బారు తరహాలోనే విక్రయాలు ఉన్నాయి. దాంతో వినియోగదారులు మద్యం సేవించి వెళ్లేవారు. ఇప్పుడు ప్రభుత్వ షాపులో కొని ఎక్కడ తాగాలో తెలియక కొంత ఇబ్బందే. బహిరంగంగా తాగాలి, లేదా ఇంటికి తీసుకుని వెళ్ళాలి. లేదా హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలి. నిషేధం ఉంటే ఒక పద్ధతి, లేకుంటే ఒక పద్ధతి. ఈ విధానం వల్ల ప్రజల్లో అసంతృప్తి. పైగా మాములు కంటే ప్రభుత్వ దుకాణాల్లో అమ్మే మద్యం 20% అధికం. ఇది మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు. ఇది అదనపు ఖర్చు, జేబుకు చిల్లు. గతంలో 200 రూపాయలకు కొనే మద్యం బాటిల్ ఇప్పుడు 240 పెట్టి కొనాలి. ఇంట్లో ఇచ్చే దాంట్లో కోత. ఇది కుటుంబంలో కొత్త సమస్యకు నాంది. చల్లటి బీరు దొరకదని, కూలింగ్ విధానం ప్రభుత్వ షాపులో ఉండదని తెలిసి లిక్కర్ ప్రియులు అప్పుడే పెదవి విరుస్తున్నారు. దీని కోనం అక్రమ పద్ధతులు తెరలేస్తాయి. ప్రభుత్వం ఒక పక్క మద్యం అమ్మకాలు చేస్తూ ఆదాయం సంపాదిస్తూ. మరో ప్రక్క నిషేధం అని చెప్పటం వింతగా ఉంది. ఈ విధానం అమల్లో ఉన్న ఢిల్లీని పరిశీలించితే అక్కడ అనేక ఏళ్ల నుంచి ఈ విధానం వున్నా కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కాలేదని గ్రహించాలి. ఇప్పటికి అమల్లో ఉన్న గుజరాత్, ఇటీవల అమల్లోకి వచ్చిన బీహార్‌లో కూడా సంపూర్ణ మద్యపానం అమలు జరగటం లేదు. కల్తీ సారా వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగాయి. ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్‌లోనే నిషేధం సాధ్యం కాలేదు. కాకపోతే అది గాంధీ పుట్టిన రాష్ట్రం కాబట్టి పాలకులు ఏ పార్టీ వారైనా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఎన్నికల్లో మహిళల నుంచి ఆకర్షణీయమైన స్లోగన్ ఓట్లు పొందటానికి.. అప్పుడే పైలెట్ ప్రాజెక్టుగా పెట్టిన జిల్లాలో జనవాసాల మధ్యపెట్టారని కృష్ణాజిల్లాలో మహిళలు రోడ్లు ఎక్కారు. మొత్తం రాష్ట్రంలో ఈ కొత్త మద్యం పాలసీని అమలు పర్చిన తరవాత కొత్త సమస్యలు ముందుకు వస్తాయి. 4300 మద్యం షాపులు, అనేక బార్లలో పనిచేసే వారి సంఖ్య 50 వేలకు పైగానే ఉన్నారు. వారంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. వారి కుటుంబాల పరిస్థితి ఏం కాను? ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తెచ్చిందా. లేక నవరత్నాలలో పెట్టాం కాబట్టి అమలు చేసి తీరతానని ఉందా?
గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం సారా అమ్మకాలు ప్రభుత్వపరంగా నిర్వహించింది. దాన్ని చిన్న చిన్న పాలిథిన్ సంచుల్లో పెట్టి అమ్మింది. ఆ పథకాన్ని ప్రభుత్వ వారుణి వాహిని అని పేరు కూడా పెట్టింది. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలు పెట్టిన పేర్లు మార్చి రాజన్న అనే పేరును తగిలించి కొనసాగిస్తున్న పద్ధతి చూశాం. మరి ఈ ప్రభుత్వ మద్యం షాపులను కూడా పేరు పెట్టాలిగా!