సయ్యద్ రఫీ, పొలిటికల్ అనలిస్ట్
సీఎం జగన్మోహన్‌రెడ్డికి దేవతా వస్త్రాలు తొడిగిస్తుంది ఎవరు? జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటింది. తన పాలనను ప్రజలు మెచ్చుకుంటారు అని ముఖ్యమంత్రి జగన్ చెపుతున్నారు. ప్రభుత్వం తీసుసున్న అనేక నిర్ణయాలు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని ఆయన అనుకుంటున్నట్టుగా ఆయన మాటల్లోనే తెలుస్తోంది. ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రోజునే ఆయన మూడు మీడియాల పట్ల తమకున్న ద్వేషాన్ని వెళ్లగక్కారు ఆ సభలోనే. ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం గతంలో ఎప్పుడూ చూసి ఉండలేదు.
అసెంబ్లీ సమావేశాల నిర్వాహణను ప్రస్తావిస్తూ దేశంలోనే గొప్పగా సమావేశాలు నివ్వహిస్తామని, ఆదర్శంగా నిలుస్తామని ప్రతిపక్షానికి ఎక్కువ సమయం కేటాయిస్తామని వాళ్ళు చెప్పే అంశాలకు విలువ ఇస్తామని, సంఖ్యా బలంతో సంబంధం లేదని చెప్పుకున్నారు. కానీ నిజంగా సభ జరిగే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఆయన మంత్రివర్గ సభ్యులు, ఇతర శాసనసభ్యులు అవి ఏవీ పాటించకపోగా చరిత్రను పునరావృతం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తాను స్వయంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును గాడిదలు కాశావా? అని తీవ్రంగా విమర్శించారు. మేము 151 మందిమి ఉన్నాం, మీరు 23మంది ఉన్నారు, మేము తలచుకుంటే మీరు ఇక్కడ ఉండలేరని ఓ హెచ్చరిక చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే విపక్షంలో వున్న అచ్చెన్నాయుణ్ణి, అతని దేహ దారుఢ్యాన్ని, అతని చూపుని హేళన చేస్తూ.. వెటకారంగా నీకు మెదడు మోకాళ్ళలో ఉందని వ్యక్తిగతoగా దూషణలు చేశారు. ఇక సహచరుడు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ యాదవ్ అయితే బుల్లెట్ దిగిందా లేదా అని వీధి భాష మాట్లాడి సభ హుందాతనాన్ని దిగజార్చాడు. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పద్ధతిలోనే, అంటే అదే దిగజారుడుతనంతోనే ఇప్పటి సభ కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు తాను ఆదర్శంగా సభను నిర్వహిస్తామని మాత్రం చెప్పుకోలేదు. జగన్ మాత్రం గొప్పగా చెప్పుకొని ఆచరణలో కనబడకపోవడంతో మనం పోల్చిచూడవలసి వచ్చింది. ఇక తాను ముఖ్యమంత్రిగా వుండేది ఒక్క వైసీపీకి ఓట్లు వేసిన వారికే కాక అందరికీ అని, పోలీస్ స్టేషన్లలో ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించాలని, తన పార్టీ శాసనసభ్యులు చెప్పినా వినవద్దని, ప్రజలకు ఏది న్యాయమో అదే చేయాలని పోలీసు శాఖ సమీక్షలో చెప్పారు. వాస్తవానికి దానికి భిన్నంగా పాలన సాగుతోందని, పల్నాడు తదితర సంఘటనలు రుజువు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో దాడులు జరిగాయి. తమ పార్టీకి ఓట్లు వేయని వారిపై చేసిన దాడులే నిదర్శనం. వైసీపీకి చెందని వారికి సంక్షేమ పథకాలు అందకుండా లబ్ధిదారుల ఏరివేత జరిగిందని అనేకమంది సోషల్ మీడియాలలో తమ ఆవేదన చెప్పుకున్నారు. ఇక ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో sc, st, bc, మైనారిటీలకు 50% ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తన కులస్తులకే ఇప్పటిదాకా 80శాతం పైగా ముఖ్యమైన పదవులన్నీ కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో కమ్మ కులస్తులకే పెద్ద పీట వేస్తున్నారని బహిరంగంగా ఆరోపించిన జగన్, తాను అధికారంలోకి వచ్చి తాను అదే పని చేసి చరిత్ర సృష్టించారు. 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని నాలుగు సంవత్సరాలు వందల సభల్లో చెప్పిన జగన్.. ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదని ఇప్పుడు మాటమార్చారు. అందుకు ప్రతిగా 20 వేలు ఇస్తానని ఒక సభలో ప్రకటించానని అసెంబ్లీలో వీడియో చూపి మరీ తప్పించుకున్నారు. కానీ 45 ఏళ్లకే పెన్షన్ అనేది ప్రజల చెవుల్లో వినిపిస్తూనే ఉంది. ఇక సన్న బియ్యం సంగతి అభాసు పాలయింది. ఉద్యోగుల నూతన పెన్షన్ విధానం వారంలో మారుస్తానని, అమ్మఒడిలో కోతలు పెట్టటం.. ఇలా ఎన్నో వాగ్దానాలు మార్చేశారు. అమరావతి పనులు ఆపటం, పోలవరం కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండర్లు, పీపీఏల సమీక్షలు, కేంద్రం తాఖీదులు ఇవన్నీ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఇసుక విధానంతో 20 లక్షలు పైగా కార్మికులు మూడు నెలలుగా పస్తులు ఉంటున్నారు. రంజాన్ తోఫా రద్దు, అన్నా క్యాంటీన్ రద్దు, చంద్రన్న బీమా రద్దు లాంటివి 16 పథకాలు రద్దు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు, గోపాలమిత్ర ఉద్యోగుల ఆందోళనలు.. ఇలా అనేకమంది, అనేక రంగాల వారు ఈ మూడు నెలలుగా నిరసనలు చేస్తూ ధర్నా చౌక్ ఒకటి తాడేపల్లిలో సృష్టించారు. ఆ ప్రాంతం ఈ ఆందోళనకారులతో నిత్యం కిటకిటలాడుతూనే ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తన పాలనలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నం చేయటంలో తప్పులేదు. కానీ అదే సమయంలో ఉన్న వ్యవస్థను రద్దు చేసి తద్వారా ప్రజల్ని ఇబ్బందులు పాల్జేయటం సరయింది కాదు. తాను ప్రకటించిన నవరత్నాలు మినహా మిగిలింది ఏది చేయనని భీష్మించుకుని పాలన చేయటం అనేక విమర్శలకు దారితీసింది. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ పనీ తాను కొనసాగించనని ఏ పధకం అమలు జరపనని అనుకుంటూ ముందుకు వెళ్ళటం, అటు ప్రజలకు, ఇటు రాష్ట్ర ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇన్ని ఇక్కట్లు ప్రజలు, రాష్ట్రం ఎదుర్కొంటుంటే ఎవరూ ఆయనకు చెప్పడం లేదా అనే అనుమానం కలుగుతోంది. లేదా సలహాదారుల మాటలను జగన్ పట్టించుకోకుండా ఉన్నారా అనేది కూడా తెలియటం లేదు. సంక్షేమం ఎంత అవసరమో అభివృద్ధి, సంపద సృష్టి కూడా అంతే అవసరం. రాష్ట్ర ఖజానా అంతా సంక్షేమానికే పరిమితం అయితే రాష్ట్ర ప్రగతి తిరోగమనం పడుతుందని పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. ఇంటిలిజెన్స్ విభాగ అధికారుల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి తనకు వాస్తవాలు చెప్పండి. నా మెప్పు కోసం సమాచారం దాయవద్దు అని చెప్పినట్లు సమాచార శాఖ తెలిపింది. ఎన్ని ప్రతికూల అంశాలు ప్రజల్లో ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు గాని, మంత్రులు గానీ, ఎంపీలు, శాసన సభ్యులు గానీ ఆయనకు చెప్పటం లేదా? మీడియాలో వస్తున్న కధనాలు ఆయన దృష్టికి వెళ్ళటం లేదా, ఇంటిలిజెన్స్ అధికారులు నివేదికలు ఇవ్వటం లేదా? మూడు నెలల్లోనే ఇంత తీవ్ర వ్యతిరేకత ముఖ్యమంత్రికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. లేదా ఎవరూ చెప్పటానికి సాహసం చేయలేక వాస్తవాలు దాస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. నేను మంచి పాలన అందిస్తున్నానని ఆయన అనుకుంటున్నారంటే ఎవరో ఆయనకు దేవతా వస్త్రాలు తొడిగిస్తున్నారని డౌట్ కలుగుతుంది.