పరిణీతి చోప్రా తన జీవితాన్ని మార్చేసిందంటున్నారు ఎంపీ రాఘవ్ చద్దా. ఇటీవల బాలీవుడ్ నటి పరిణీతి, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే.
తమ ప్రేమ పెళ్లివైపు పరుగులు తీస్తున్న తరుణంలో… తనకు కాబోయే భార్యపై తనకున్న ప్రేమాభిమానాల్ని ఇలా బయటపెట్టారు రాఘవ్ చద్దా. ఒక మంచి రోజు ఆ అందమైన అమ్మాయి (పరిణీతి చోప్రా) తన జీవితంలోకి వచ్చిందని చెప్పారు.
అప్పటి నుంచి తన జీవితమే మారిపోయిందన్నారు. తన ప్రయాణాన్ని పరిణీతి రంగులమయంగా మార్చిందని..ఎన్నో నవ్వుల్ని, సంతోషాల్ని తెచ్చిందని స్పందించారు చద్దా.
తమ నిశ్చితార్థం ఎంతో సంతోషకరంగా జరిగిపోయిందని, అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ఆనంద బాష్పాలు, చిరునవ్వులు, సంతోషాలు, డ్యాన్సులతో నిండిపోయిందని గుర్తు చేసుకున్నారు.
ఈ వేడుక తమ ప్రియమైన వారిని మరింత దగ్గర చేసిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఈ మేరకు నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
ఢిల్లీలోని రాజీవ్ చౌక్‌లో గల కపుర్తాల హౌస్‌లో పరిణీతి, రాఘవ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, చిత్ర పరిశ్రమలోని సహచరులు హాజరయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పరిణీతి సోదరి ప్రియాంకా చోప్రా తదితరులు హాజరై కాబోయే కొత్త జంటను ఆశీర్వదించారు.