ఇప్పటి వరకూ కాంచన సిరీస్ పేరుతో హారర్ కామెడీ చిత్రాలు మాత్రమే చేస్తున్న వచ్చిన రాఘవ లారెన్స్, ఇకపై కాంచనా సినిమాలకి ఫుల్ స్టాప్ పెడుతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ప్రస్తుత్తం కాంచన సినిమాని హిందీలో లక్ష్మీ బాంబ్ గా తెరకెక్కిస్తున్న లారెన్స్, ఇది అయిపోగానే మెగా పవర్ స్టార్ హిట్ సినిమాని రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ అనగానే ప్రతి సినీ అభిమానికి మగధీర గుర్తొస్తుంది. జక్కన్న చెక్కిన ఈ సూపర్ హిట్ సినిమాని కూడా మరిపిస్తూ ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన మూవీ రంగస్థలం. సుకుమార్ డైరెక్షన్ లో గతేడాది రిలీజ్ అయిన రంగస్థలం, చరణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా నాన్ బాహుబలి రికార్డులని చెరిపేస్తూ బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టించింది. చరణ్ కెరీర్ ని పూర్తి స్థాయిలో మలుపు తిప్పిన ఈ సినిమాని ఇప్పుడు తమిళ్ లో రీమేక్ చేయడానికి లారెన్స్ రెడీ అవుతున్నాడు.
సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు పాత్రలో చరణ్ అద్భుతంగా నటించి మెప్పించాడు, మరి అలాంటి పాత్రలో ఎవరు నటిస్తాడు? అనే విషయం ఆలోచిస్తే… ధనుష్, సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి లాంటి హీరోల పేర్లు లారెన్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. వీరిలో ధనుష్ ఇప్పటికే ఆడుకలం, అసురన్ లాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలో నటించి మెప్పించాడు. కార్తీ, విజయ్ సేతుపతి కూడా విలేజ్ లో నడిచే కథల్లో కనిపించి మెప్పించిన సందర్భాలు ఉన్నాయి. సో మిగిలింది సూర్యనే కాబట్టే, లారెన్స్ అతనికే ఓటేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సూర్య, హరితో కూడా మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరి సింగం 4 కథని సిద్ధం చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు సూర్య, రంగస్థలం రీమేక్ లో నటించే ఛాన్స్ ఉంది. అయితే రంగస్థలం సినిమాలో చరణ్ పాటు ఆది పినిశెట్టికి కూడా మంచి పాత్ర ఉంది. చరణ్ క్యారెక్టర్ ని సూర్య చేస్తే, ఆది పినిశెట్టి పాత్రలో కార్తీ నటించే అవకాశం ఉంది. నిజ జీవితంలో అన్నతమ్ములు అయిన ఈ ఇద్దరూ ఇప్పటివరకూ కలిసి నటించలేదు. రంగస్థలం రీమేక్ లో సూర్య, కార్తీ కలిసి నటిస్తే… అది సినిమా రిజల్ట్ కి మరింత హెల్ప్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా చరణ్ చిట్టి బాబు పాత్రకి ప్రాణం పోశాడు. సుకుమార్ టేకింగ్ రంగస్థలం సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. హారర్ కామెడీ సినిమాలు చేసిన లారెన్స్, రంగస్థలం లాంటి ఎమోషనల్ కంటెంట్ ని సరిగా హ్యాండిల్ చేయగలడా? అనేది ఆలోచించాల్సిన విషయమే.