ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికల ప్రయత్నాల్లో ఉన్నారని కొన్నాళ్ల నుంచి ప్రచారం సాగుతోంది. 2018 సమయంలో కేసీఆర్ మాదిరిగానే ఇప్పుడు ఈయన కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారనే చర్చ జోరందుకుంది. తాజాగా ఇదే అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు రఘురామ. కొత్త అప్పులకు జగన్ సర్కార్ ఎదురుచూస్తోందని, ప్రభుత్వ పథకాలకు సరిపడా నిధులు లేవని చెప్పారు. ఈ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మినహా వేరే ఆప్షన్ జగన్ ముందు లేదని విమర్శించారు.
రాష్ట్రాన్ని అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్ గా జగన్ నిలబెట్టారంటూ పదేపదే రఘురామ సెటైర్లు వేస్తూ వస్తున్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ వస్తున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిని సమర్ధించుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు రఘురామ.
ఈక్రమంలోనే మరోసారి జగన్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ మాట తప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రజల పట్ల తన పద్ధతి మార్చుకోవాలని జగన్ కు సూచించారు. డబ్బుల్లేక ముందస్తుకు వెళ్లేందుకు చూస్తున్నారని అన్నారు రఘురామకృష్ణరాజు.