జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన ఏడాది లోపు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం మాట తప్పిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కూకట్ పల్లి ఇందిరానగర్, బాలానగర్ బస్తీల్లో ఆయన పర్యటించారు. అక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
నేతాజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రఘునందన్. జంట నగరాల అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ తో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
ఇందిరా నగర్ లో మూడు తరాలుగా నివసిస్తున్న వారికి సైతం ఇప్పటికీ ఇంటి నెంబర్లు కేటాయించకపోవడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్యే. కేటీఆర్ బస్తీల్లో పర్యటిస్తే అక్కడ నివసించే వారి బాధలు తెలుస్తాయని సూచించారు.
ఇందిరా నగర్ కు కేటీఆర్ రావాలని.. ఇక్కడి ప్రజల బాధలను తెలుసుకోవాలని అన్నారు రఘునందన్. ప్రగతి భవన్, సెక్రటేరియట్ కు పెట్టే ఖర్చులో పదో శాతం పెట్టినా నగరంలో ఇలాంటి బస్తీలు ఉండవని చెప్పారు.