ఫాం హౌస్ కేసులో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలివ్వడంపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. హైకోర్టు ఆదేశాలను ఆయన స్వాగతించారు. తప్పు చేయనప్పుడు సీబీఐ విచారణకు సీఎం కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ఫాం హౌస్ కేసులో దొరికిన రూ. 15కోట్లతో పాటు ఎరుపు రంగు కార్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఆ కారు ఎవరిదనే విషయాన్ని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుతో దొంగలు ఎవరో బయటపడతారని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆయన అన్నారు.
ఈ కేసులో పోలీసులు చేసిన దర్యాప్తు వివరాలు సీఎం కేసీఆర్ టేబుల్ పైకి చేరడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడమే బీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణకు కేంద్రం నిధులివ్వలేని ఎంపీలు ఆరోపిస్తున్నారని, అలాంటప్పుడు ఈ అంశంపై పార్లమెంట్‌లో ఈ అంశంపై వారు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దుబ్బాక, గజ్వేల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.