వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజ్యసభ సీట్లను కేసీఆర్ అమ్ముకున్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ పొందిన ముగ్గురు 40 ఎమ్మెల్యే స్థానాలను పంచుకున్నారని అన్నారు.
పెద్దల సభ అంటే సూట్ కేసులు తెచ్చుకున్నోళ్లు వెళ్ళేది కాదన్న రఘునందన్.. అక్కడకు విజ్ఞులను పంపాలని సూచించారు. రాజ్యసభకు చదువుకున్నోళ్లు వెళ్ళాలి కానీ సంచులు తెచ్చినోళ్లు కాదన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లకు సీట్లు కేటాయించారని మండిపడ్డారు. శంకరమ్మ వంటి ఉద్యమకారులు కేసీఆర్ కు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
అగ్రకులాల వారికే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఇక రాజీవ్ హయాం నుంచే గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు వెళ్తున్నాయన్నారు రఘునందన్. రాష్ట్రంలో ప్రతీ స్కీమ్ కు కేంద్రం నిధులు ఇస్తుందని వివరించారు. కేంద్ర పథకాలను టీఆర్ఎస్ తమవిగా చెప్పుకుంటూ తిరుగుతోందని మండిపడ్డారు.
కేంద్రాన్ని బద్నాం చేసేందుకే టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందన్న ఆయన.. డైరెక్టుగా నిధులు ఇస్తే తప్పేముందన్నారు. అవినీతి లేకుండా ఉండేందుకే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బులను నేరుగా ఖాతాల్లో వేస్తోందని అన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతోన్న ఇబ్బందేంటని ప్రశ్నించారు.
విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా.. అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుందని ఆరోపించారు. పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే చెల్లుతుందని… సర్పంచులు ఆస్తులు అమ్ముకుని ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా, కాలం వెళ్లదీస్తున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. టీఆర్‌ఎస్ నేతల కమీషన్లకు అడ్డుకట్ట వేసేందుకే నేరుగా నిధులు ఇస్తున్నట్లు తెలిపారు రఘునందన్.