టీఆర్ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ బరితెగిస్తోందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ తరపున బూత్ లెవెల్ అధికారులే క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీకే ఓటేయాలని అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. అధికారుల తీరుపై స్పందిస్తారా.. లేదా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయమంటారా అంటూ ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రం నిజంగా బంగారు తెలంగాణగా మారిందంటే తమ పార్టీ నాయలకులంతా మునుగోడు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతామన్నారు. నారాయణపూర్ మండలం గుజ్జ గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…
తనను గెలిపిస్తే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గుజ్జ గ్రామంలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సీఎం కేసీఆర్ కట్టించి ఇచ్చారో మహిళలు ఆలోచించుకోవాలని సూచించారు.
గ్రామాల్లోని పేదలకు ఇండ్లు కట్టించేందుకు కేసీఆర్ కు చెయ్యి రావట్లేదు గాని, ప్రగతిభవన్ నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు చేసి ఆరు నెలల్లో పూర్తి చేశారని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సిమెంటు, స్టీలు దొరకడం లేదని కుంటి సాకులు చెబుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు.
ఐదు రోజులుగా కేసీఆర్ ఆయన బిడ్డను వెంటపెట్టుకుని ఢిల్లీలో ఉంటున్నారని చెప్పారు. ఢిల్లీలో బిడ్డకు బంగ్లా కూడా కట్టిస్తున్నాడని చెప్పారు. ఢిల్లీలో బిడ్డకు బంగ్లా కట్టించడానికి స్టీలు, సిమెంటు దొరుకుతుంది కానీ పేద ప్రజలకు ఇల్లు కట్టించడానికి స్టీలు, సిమెంటు దొరకడం లేదని మండిపడ్డారు.