కేసీఆర్ కు భవిష్యత్ కనిపిస్తోందని.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. జిల్లాల పర్యటనలో ఆ జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా మోడీని, బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఎవరితో పొత్తు కోసం బీజేపీని తిడుతున్నారో అర్థం అవుతోందని చెప్పారు.
రాహుల్ గాంధీపై ప్రేమ కురిపిస్తున్న కేసీఆర్ కు మోడీపై సోనియా చేసిన అనుచిత వ్యాఖ్యలు గుర్తులేవా?.. ప్రధాని భార్యను చంద్రబాబు తిట్టినప్పుడు కన్నీళ్లు రాలేదా? అని ప్రశ్నించారు రఘునందన్. సోనియా గాంధీని ఇటలీ దయ్యం అన్నది ఎవరు..? మొన్నటి ప్రెస్ మీట్లో వాడిన భాష ఏంటని కడిగిపారేశారు. భాష గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని సెటైర్లు వేశారు.
వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పొత్తు కోసం కేసీఆర్ తహతహలాడుతున్నారని ఆరోపించారు రఘునందన్. బీజేపీ వల్ల మత ఘర్షణలు వస్తాయన్న కేసీఆర్ కు బైంసా అల్లర్ల వెనుక ఉన్నది ఎవరో తెలియదా..? పాతబస్తీలో మత ఘర్షణలు చేసింది ఎవరో తెలియదా? అని ప్రశ్నించారు. దేశంలో జరిగిన మత ఘర్షణలపై బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ చేశారు. ఒకవేళ చర్చకు రాకపోతే అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలకు టైం ఇవ్వమని అడిగారు.
2014కు ముందు పాతబస్తీలో హిందువుల సంఖ్య ఎంత.. ఇప్పుడు ఎంత ఉందో కేసీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు రఘునందన్. హిందూ దేవాలయాల్లోకి దర్గాలు ఎలా వచ్చాయని.. 2014 ఎన్నికల అఫిడవిట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు ఎంత..? 2018 ఎన్నికల ఆఫిడవిట్లలో ఉన్నది ఎంతో చర్చిద్దామా అంటూ సవాల్ చేశారు రఘునందన్.